ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యం కోల్పోకుండా చివరి వరకు దేశం కోసం పోరాడాలని చాటి చెప్పింది ఆ ధీర వనిత. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని, దుండగుల బారి నుంచి మన దేశాన్ని, అందులో నివసించే ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె గుర్తు చేసింది. దేశానికి అత్యంత ఉన్నతంగా చెప్పుకోబడే పవిత్రమైన పార్లమెంట్‌పై ముష్కరులు జరిపిన దాడిని ఆదిలోనే గ్రహించి పెను ప్రమాదం జరగకుండా చూసింది. అయితే ఆ దాడిలో దురదృష్టవశాత్తూ ఆ మహిళా పోలీస్ అధికారిణి మృతి చెందింది. అయినా ఆమె దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. భారత ప్రభుత్వం కూడా ఆమె చూపిన తెగువకు అత్యున్నత స్థాయి పురస్కారాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అందజేసింది. ఇంతకీ ఆ మహిళా ఆఫీసర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.
దేశ రాజధాని ఢిల్లీలోని వికాస్‌పురి అనే ప్రాంతానికి చెందిన కమలేష్ కుమారి యాదవ్ అనే యువతి 1994లో సీఆర్‌పీఎఫ్ విభాగంలో కానిస్టేబుల్‌గా బాధ్యతలు చేపట్టింది. అనంతరం ఆమెకు అలహాబాద్‌లోని ఎలైట్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్)లో పోస్టింగ్ లభించింది. అనంతరం 2001 జూలై 12న 88వ మహిళా బెటాలియన్‌లో ఉద్యోగం ఇచ్చారు. ఈ ఉద్యోగంలో భాగంగా ఆమె బ్రేవో కంపెనీలో సిబ్బందిగా మారింది. ఈ బ్రేవో కంపెనీ సిబ్బంది అంతా పార్లమెంట్ సెషన్‌లు జరిగే సమయంలో ఆ భవనానికి రక్షణ కల్పించే వారు.

kamleshkumari

కాగా 2001వ సంవత్సరం డిసెంబర్ 13న కమలేష్ కుమారి యాదవ్ పార్లమెంట్ హౌస్ వద్ద గేట్ నం.11కు పక్కనే ఉన్న గేట్ నం.1 వద్ద యథావిధిగా విధి నిర్వహణలో ఉంది. అదే సమయంలో DL 3C J 1527 అనే నంబర్ గల ఓ అంబాసిడర్ కార్ విజయ్ చౌక్ నుంచి ఆమె ఉన్న గేట్ నం.1 వద్దకు రాసాగింది. దీంతో వెంటనే ఆ కార్ వద్దకు వెళ్లి విచారించగా అందులో టెర్రరిస్టులు ఉన్నారని ఆమెకు అనుమానం వచ్చింది. తక్షణమే కమలేష్ స్పందించి వెనక్కి తిరిగి గేట్ మూసేందుకు తన స్థానం వద్దకు వెళ్లింది. అయితే అప్పటికే ఆ టెర్రరిస్టుల కారు దహనానికి గురైంది. దీంతో ముందుకు వెళ్లడం వారికి కష్టతరమైంది. అయితే వారు వెంటనే ఫైరింగ్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే దురదృష్టవశాత్తూ 11 బుల్లెట్లు కమలేష్ యాదవ్ పొట్టలోకి దూసుకెళ్లాయి. ఆ రోజు సరిగ్గా ఉదయం 11.50 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సూసైడ్ బాంబర్లు పార్లమెంట్‌లోకి ప్రవేశించక మునుపే గేట్ నం.1ను కమలేష్ క్లోజ్ చేసి హెచ్చరిక అలారంను మోగించింది. దీంతో సెక్యూరిటీ అంతా క్షణాల్లో అలర్ట్ అయి పెను ప్రమాదం జరగకుండా చూశారు. కానీ ఎంతో ధైర్య సాహసాలు చూపిన కమలేష్ మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

01_9405

కమలేష్ యాదవ్ అత్యంత ధైర్యం, తెగువను ప్రదర్శించినందుకు గాను అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అశోక చక్ర అవార్డును 2002వ సంవత్సరం రిపబ్లిక్ డే రోజున అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. అప్పటి భారత ప్రధాని వాజ్‌పేయి కమలేష్‌కు నివాళులర్పించారు. అయితే పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో కీలక సూత్రధారి అయిన మహమ్మద్ అఫ్జల్‌కు భారత సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో అఫ్జల్ కుటుంబం రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ విషయం తెలిసిన కమలేష్ కుటుంబ సభ్యులు అఫ్జల్‌కు క్షమాభిక్ష పెడితే తమకు ఇచ్చిన పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి కలాం ఆ దరఖాస్తును తిరస్కరించడం కాదు కదా, అసలు దాని వంకే చూడలేదు. అయితే 2006 డిసెంబర్ 13న కమలేష్ కుటుంబంతోపాటు దాడి ఘటనలో సాహసాలు చూపిన మరికొందరు అధికారులకు చెందిన కుటుంబాలు కూడా తమకు ప్రభుత్వం ఇచ్చిన గ్యాలంట్రీ మెడల్స్‌ను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశాయి. తీవ్రవాది మహమ్మద్ అఫ్జల్ ఉరితీత ఆలస్యం కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలియజేశారు.
కాగా 2013 సంవత్సరం ఆరంభంలో కలాం అనంతరం రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ప్రణబ్ ముఖర్జీ అఫ్జల్ కుటుంబ సభ్యుల క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో 2013 ఫిబ్రవరి 9న భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు తీహార్ జైల్‌లో మహమ్మద్ అఫ్జల్‌ను ఉరితీశారు. అనంతరం కమలేష్ కుమారి యాదవ్ కుటుంబం, మిగతా అధికారుల కుటుంబాలు తమ మెడల్స్‌ను ప్రభుత్వం నుంచి తిరిగి తీసుకున్నాయి.
అయితే ఎన్ని మెడల్స్ ఇచ్చినా, పురస్కారాలు, నివాళులు అందజేసినా దేశాన్ని రక్షించాలని కమలేష్ చూపిన తెగువ మాత్రం అభినందనీయం. ఆమె వృత్తి నిబద్ధత ఇతర అధికారులకే కాదు, యావత్ దేశ పౌరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top