అధికార టీఆర్ ఎస్ పార్టీతో పొత్తులు పెట్టుకున్న ఎంఐఎం పార్టీ సందర్భానుసారం తన సొంత వ్యవహారశైలిని ప్రదర్శిస్తోంది. ఇటు తమ ఇలాకా అయిన గ్రేటర్ లో అటు అవకాశం దొరికినపుడు అసెంబ్లీలో టీఆర్ ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ఎంఐఎం రెడీగా ఉంటోంది. తాజాగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ తొలి సమావేశం ఎంఐఎం మూలంగా రసాభాసగా సాగింది. తమ మిత్రపక్షమని చెప్పుకుంటున్న అధికారపార్టీకి ఈ సమావేశంలో ఎంఐఎం ఘాటు ఝలక్ ఇచ్చింది.

తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి నివాళి అర్పించడంతో ఈ సమావేశం ప్రారంభమైంది. తర్వాత నగర అభివృద్ధిపై కౌన్సిల్ లో చర్చ జరిగింది. హైదరాబాద్ లో తలపెట్టిన ఎస్ ఆర్ డీపీ ప్రాజెక్టుకు కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. మూసీనదిపై 5916 కోట్లతో నిర్మించతలపెట్టిన ఈస్ట్ వెస్ట్ కారిడార్ లోని ఆరులైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే నిధులను ఇవ్వాలని కౌన్సిల్ తీర్మానించింది. అయితే గత పాలక వర్గంలో చేపట్టిన పనులను కూడా ఈ జాబితాలో చేర్చడంపై ఎంఐఎంకు చెందిన మాజీ మేయర్ మాజిద్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాజిద్ ను మాట్లాడుతుండగా కూర్చోవాలని మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశించడంతో వివాదం రగులుకుంది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ మేయర్ పోడియం వద్ద ఎంఐఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఆ కార్పొరేటర్లకు అధికారపార్టీ ఎమ్మెల్సీలు ప్రభాకర్ - సుధాకర్ రెడ్డిలు సర్థిచెప్పే యత్నం చేశారు. అయితే వారిపైనా ఎంఐఎం నేతలు విమర్శలు చేశారు. మండలిలో ప్రతిపక్షపార్టీల గొంతు నొక్కినట్లు ఇక్కడా చేయవద్దని సెటైర్లు వేశారు.

ఇదిలాఉండగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మెట్రోరైల్ ప్రాజెక్టుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఫైరయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్వయంగా వివరించుకోవాల్సి వచ్చింది. చూస్తుంటే తమ డిమాండ్ల సాధనకోసం ఎంఐఎం డిమాండ్ల పరంపర షురూ అయినట్లుందని రాజకీయవర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top