వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యవహారంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకదాని వెంట మరొకటిగా సాగిపోతున్న పరిణామాలతో హైటెన్షన్ నెలకొంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు.. గతంలో ఏం జరిగింది? అన్న అంశాల్లోకి వెళితే..
అసలు వివాదం
ఏపీ అసెంబ్లీలో రోజా చేసిన వ్యాఖ్యలు.. ఆమె వ్యవహారశైలిని తప్పు పడుతూ.. ఆమెను అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెన్షన్ విధిస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. దీనిపై రోజా హైకోర్టుకు వెళ్లారు. ఆమె కేసును విచారణకు కోర్టు అనుమతి రాకపోవటంతో సుప్రీంకు వెళ్లి.. అనుమతి తెచ్చుకున్నారు.
సుప్రీం ఆదేశాలతో ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. రోజాపై విధించిన సస్పెన్షన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. నాలుగు వారాలకు కేసును వాయిదా వేశారు.మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఈ సెషన్ కు రోజా అసెంబ్లీకి హాజరు అయ్యే అవకాశం కలిగింది.
హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఆమెప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో కోర్టు నుంచి ఉత్తర్వులు కాపీలు తీసుకొని అసెంబ్లీకి వెళ్లేందుకు రోజా రెఢీ అవుతున్నారు. కోర్టు నుంచి నేరుగా అసెంబ్లీకి వస్తున్న ఆమెకు అసెంబ్లీ గేటు నెంబరు 1 దగ్గర నుంచి స్వాగతం పలికేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్.. మరికొందరు నేతలు సిద్ధం అవుతున్నారు.
రోజా ఇష్యూపై అధికారపక్ష వాదన..
ఇదిలా ఉంటే.. రోజా ఇష్యూపై హైకోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులపై ఏపీ అధికారపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో అప్పీలుకు వెళ్లాలని ఏపీ అసెంబ్లీ నిర్ణయించింది. 212 నిబంధన ప్రకారం శాసనసభా వ్యవహారాల్లో.. నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకునే అధికారం లేదని.. నిబంధనల పరమైన తప్పులు జరిగినా జోక్యం చేసుకునే అధికారం కోర్టుకు లేదని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై న్యాయవాద వర్గాల వాదన..
రోజా ఇష్యూలో మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టు న్యాయవాదులు కొందరు చేసిన వాదనలు మరోలా ఉన్నాయి. ఏ సెక్షన్ కింద అయితే రోజాను ఏడాది పాటు సస్పెన్షన్ విధించారో.. ఆ సెక్షన్ కింద అలా చేయకూడదని.. ఒక సెషన్ కు మాత్రమే చేయటం వల్ల మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు వెలువరించినట్లుగా చెబుతున్నారు.
ఇప్పుడేం జరుగుతుంది?
రోజాకు స్వాగతం పలకటానికి విపక్ష నేతలు రెఢీ అవుతుంటే.. ఆమెను అడ్డుకోవాలని ఏపీ అసెంబ్లీ నిర్ణయించింది. రోజాను అడ్డుకునేందుకు వీలుగా భారీగా మహిళా పోలీసుల్ని దించటంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రోజాను తాము అడ్డుకుంటామని ఏపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాటు ఉన్న సస్పెన్షన్ కాలపరిమితి తీరకుండా రోజాను అడుగుపెట్టనీయమని వ్యాఖ్యానించారు.
దీనిపై జగన్ నేతలు ఏం చెబుతున్నారు?
ఏపీ అధికారపక్ష నేతలు రోజాను అడ్డుకుంటామని చెప్పటంపై జగన్ బ్యాచ్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదేమీ టీడీపీ ఆఫీసు కాదని.. అసెంబ్లీ అని.. రోజాను అడ్డుకుంటే తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని మండిపడుతున్నారు.
స్పీకర్ ఏం చేస్తున్నారు?
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో స్పీకర్ కోడెల కోర్టు ఆదేశాల గురించి వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. 212 నిబంధన ప్రకారం అసెంబ్లీ నిర్ణయాల్ని కోర్టులు తప్పుబట్టలేవన్న వాదనను ప్రభుత్వం ప్రస్తావించటంతో పాటు.. ప్రొసీజరల్ పొరపాట్లను ఆధారంగా చేసుకొని సభ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు తప్పుబట్టలేవన్న వాదనను ప్రభుత్వం ప్రస్తావించనుంది. ఇందుకు తగినట్లుగా కాస్త గట్టి వాదనను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
అసెంబ్లీలో పరిస్థితి ఎలా ఉంది?
రోజాను అడ్డుకునేందుకు స్పీకర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేయటంతో భారీగా మహిళా మార్షల్స్ ను మొహరించారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇరు వర్గాల్లోనూ ఉత్కంట నెలకొంది. మొత్తంగా అసెంబ్లీ ప్రాంతం హైటెన్షన్ నెలకొంది.
Post a Comment
Thank U For ur Comments