తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులపాల్జేస్తున్నాయి. మిగులు రాష్ట్రమైన తెలంగాణలో జీతాలు - భత్యాల విషయంలో ఆ ప్రభుత్వం ఉదారంగా ఉంటోంది. ఉద్యోగుల నుంచి దాదాపు అందరికీ జీతాలు ఇప్పటికే భారీగా పెంచారు. ఇక ప్రజా ప్రతినిధులకైతే చెప్పనవసరం లేదు. సర్పంచిలు - ఎంపీటీసీలు - జడ్పీటీసీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు... ఇలా అందరికీ భారీగా జీతాలు పెంచారు. దీంతో ఏపీలోనూ ఆయా వర్గాలు తమకూ అదేస్థాయిలో జీతాలివ్వాలని కోరుతున్నాయి. తెలంగాణ ప్రభావంతో ఏపీలోనూ ఉద్యోగులకు - మరికొందరికి జీతాలు పెంచినా ఎమ్మెల్యేలకు పెంచలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా తమ జీతాలు పెంచాలని కోరుతున్నారు. అయితే... ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం ఇప్పట్లో పెంచేది లేదని ఖరాకండీగా చెప్పేశారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఈ కోరిక కోరగా యనమల తల అడ్డంగా ఊపారు.
శాసన సభ అభివృద్ధి నిధులు ఎమ్మెల్యేలకు కేటాయించాలని వైఎస్ ఆర్ సీపీ సభ్యుడు - గూడూరు ఎమ్మెల్యే సునీల్ అసెంబ్లీలో కోరారు. తెలంగాణ ఎమ్మె ల్యేలకు రూ. 3 లక్షల జీతం ఇస్తుంటే తమకు రూ.1.20 లక్షలే ఇస్తున్నారన్నారు. దీనిపై స్పందించిన యనమల రామకృష్ణుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యేల జీతాలను పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. నిజానికి ఏపీలో ఎమ్మెల్యేలకు జీతాలు పెంచాల్సిన అవసరం కూడా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వారి వ్యవహారాలు - వ్యాపారాల వల్ల ఆదాయం భారీగానే ఉంటోందని... అలాంటి పరిస్థితుల్లో వారికి జీతాలతో పనేంటన్న వాదన వినిపిస్తోంది. గతంలో కమ్యూనిస్టు పార్టీల ఎమ్మెల్యేలు కొందరు నీతి నిజాయితీ - విలువలతో బతుకుతూ ఎమ్మెల్యేలుగా పనిచేసినా కూడా నిరుపేదలుగా ఉండేవారు. ప్రస్తుతం అంత దీన స్థితిలో ఎవరూ లేని కారణంగా ప్రస్తుత జీతాలు సరిపోతాయని ప్రభుత్వం కూడా అనుకుంటోంది.
Source: Tupaki.com