నాయకులు - ఉద్యమకారులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎంత సహజంగా మారిందో.... అలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారి పట్ల క్రూర చర్యలు తీసుకోవాలని అందుకు బహుమతులు ఇస్తామని ప్రకటించేవారి సంఖ్యా పెరిగిపోతోంది. ఇప్పటికే కన్హయ్య కుమార్ విషయంలో పలువురు రివార్డులు ప్రకటించడం తెలిసిందే. ఆయన నాలుకను కోసేయాలని... చంపేయాలని చెబుతూ అందుకు బహుమతులు ప్రకటించారు. అది సద్దుమణిగిందో లేదో అలాంటిదే ఇంకోటి మొదలైంది. తాజాగా మజ్లిస్ పార్టీ అధినేత - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన వ్యాఖ్యలతో వివాదం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తన కంఠంలో ప్రాణం ఉండగా భారత్  మాతాకి జై అని తాను అనే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ నేపథ్యంలో అసద్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మీరట్ కాలేజి విద్యార్థి సంఘం మాజీ నేత దుష్యంత్ తోమార్ దీనిపై మండిపడ్డారు. ఒవైసీ నాలుక కత్తిరించిన వారికి రూ.21 వేల రివార్డు ఇస్తానని ప్రకటించారు. 

గొంతుపై కత్తి పెట్టినా భారత్ మాతాజీ జై అన్న నినాదాన్ని చేయబోనని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడం తనకు చాలా ఆగ్రహాన్ని కలిగించిందని చెప్పిన దుష్యంత్ తోమార్ ఆ ప్రకటన ఒవైసీ దేశ వ్యతిరేకే కాకుండా ఆయన దేశభక్తుడు కాదన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నదని పేర్కొన్నారు. 2014-15 సంవత్సరంలో విద్యార్థి సంఘం నాయకుడు అయిన తోమార్ ఆ తరువాత బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం అయిన అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యుడు. ఒవైసీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని దుష్యంత్ డిమాండ్ చేశారు.

Source: tupaki.com

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top