వేసవిలో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణ మార్పులు సహజమే! అయితే ఈ తుపాను ఎప్పుడొస్తుందో తెలియదు. కాబట్టి ఎక్కడున్నా, ఏ సమయంలో తుపానొచ్చినా దాన్నుంచి తప్పించుకునేలా ఈ జాగ్రత్తలు పాటించాలి.


రోడ్డు మీద ఉన్నప్పుడు: తుపాను సూచన వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రయాణం చేయవలసివస్తే మీరు వెళ్లే రూటు గురించి దగ్గరివాళ్లకి తెలియపరచాలి. కారులో ఎమర్జెన్సీ కిట్‌ ఉంచుకోవాలి. దీన్లో ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌తోపాటు, ఫ్లాష్‌ లైట్‌, ప్రొటీన్‌ బార్స్‌, నీళ్లు, మందులు, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లు ఉంచుకోవాలి. విండ్‌షీల్డ్‌ క్లీనింగ్‌ క్లాత తప్పనిసరి.




డ్రైవ్‌ చేస్తుంటే: డ్రైవ్‌ చేస్తున్నప్పుడు గాలి వాన మొదలైతే హజార్డ్‌ లైట్స్‌ ఆన్‌ చేసి ఉంచాలి. బలంగా బ్రేక్‌ నొక్కకూడదు. విండ్‌ షీల్డ్‌ మీద తేమ పేరుకోకుండా విండో మిర్రర్స్‌ కొద్దిగా దింపి ఉంచాలి. వీలైతే రోడ్డు పక్కగా చెట్లకు, కరెంటు స్తంభాలకు దూరంగా కారును ఆపేయాలి. కరెంటు ప్రవహించే వీలున్న వస్తువులకు దూరంగా కారును పార్క్‌ చేయాలి.




ఆరుబయట ఉన్నప్పుడు: ఉరుములు, మెరుపుల నుంచి తప్పించుకోవాలంటే వెంటనే దగ్గర్లోని ఇల్లు లేదా మెటల్‌ బాడీలో ఆశ్రయం పొందాలి. కారును మెరుపులు తాకితే ఆ విద్యుత్తును లోహం పీల్చుకుని మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి కారులో ఎక్కడానికి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఆరుబయట ఉన్నప్పుడు మాత్రం లోహపు స్థంబాలకు, చెట్లకు దూరంగా ఉండాలి. పొడవాటి వాటిని మొదట మెరుపులు తాకుతాయి. కాబట్టి లోతుగా ఉన్న ప్రదేశానికి చేరుకోవాలి. విశాలంగా ఉండే ఓపెన్‌ స్పేస్‌లో నిలబడకూడదు. ఆ మొత్తం ప్రదేశంలో మీరొక్కరే ఎత్తుగా ఉంటారు కాబట్టి మెరుపు మిమ్మల్ని తాకే అవకాశాలే ఎక్కువ. అలాగే విద్యుత్తు తీగలకు కూడా దూరంగా ఉండాలి. గుంపులో నిలబడకుండా వ్యక్తికీ వ్యక్తికీ మధ్య కనీసం 50 - 100 అడుగుల దూరం పాటించాలి. ఇలా చేయటం వల్ల ఒకరి నుంచి మరొకరికి విద్యుత్తు ప్రసరించకుండా ఉంటుంది. రబ్బర్‌తో తయారైన చెప్పులు ధరించాలి.




ఇంట్లో ఉంటే: కిటికీలు, తలుపులకు దూరంగా ఉండాలి. లేదంటే గాలికి ఇవి పగిలి గాజు పెంకులు గుచ్చుకునే ప్రమాదం ఉంది. నీళ్లకు దూరంగా ఉండాలి. మెరుపు ఫోన్‌ లైన్‌ను తాకితే విద్యుత్తు దాంతో సంబంధం ఉన్న ప్రతి ఫోన్‌లోకి ప్రవహిస్తుంది. కాబట్టి ల్యాండ్‌ లైన్‌ ఫోన్లకు దూరంగా ఉండాలి. అన్ని విద్యుత్తు ఉపకరణాలను స్విచాఫ్‌ చేయాలి. ఉరుములు, మెరుపులు ఆగిపోయిన తర్వాతే స్విచాన్‌ చేయాలి.



పెంపుడు జంతువులుంటే: ఉరుములు, మెరుపులకు జంతువులు భయపడతాయి. కాబట్టి వాటికి ఇంట్లోనే చోటివ్వాలి. డాగ్‌ హౌస్‌, చైన్స్‌ లైటెనింగ్‌ ప్రూఫ్‌ కావు. కాబట్టి వాటిని ఇంట్లోనే దుప్పటి మీద పడుకోబెట్టాలి. ఆ ప్రదేశం వెచ్చగా, నిశ్శబ్దంగా ఉండాలి. వాన నీళ్లు జంతువులుండే ప్రదేశానికి ప్రవహించకుండా చూసుకోవాలి. లేదంటే వాటికి జీర్ణకోశ సమస్యలు తప్పవు. అలాగే జంతువులు ఆందోళనకు లోనవ్వకుండా పక్కనే ఉండి భరోసా కల్పించాలి.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top