• డ్రైవర్‌ కూడా.. డివైడర్‌తో కారు ఢీ
  • వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయాలు
  • అతివేగం, డ్రైవర్‌ నిద్రమత్తే కారణం!


హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు భార్య సాహిత్యవాణి మృతి చెందారు. కారు డ్రైవర్‌ స్వామిదాస్‌ కూడా అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. సమీప బంధువు, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పిన్నమనేని పూర్ణవీరయ్య(బాబ్జీ) కుమార్తె నూతన వస్త్ర బహూకరణ వేడుకలకు వెంకటేశ్వరరావు దంపతులు ఆదివారం విజయవాడ వచ్చారు. అనంతరం అక్కడి నుంచి స్వగ్రామమైన గుడివాడ సమీపంలోని రుద్రపాక చేరుకున్నారు. వాస్తవానికి పిన్నమనేని దంపతులు మంగళవారం కూడా ఇక్కడే ఉండాల్సి ఉంది. ఆయన సమీప బంధువు పిన్నమనేని రాజారావు షష్టిపూర్తి వేడుకలు మంగళవారం గుడివాడలో జరగాల్సి ఉన్నందున... ఆ కార్యక్రమానికి హాజరై హైదరాబాద్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, పుణెలో వైద్య విద్యను అభ్యసిస్తున్న పిన్నమనేని కుమార్తె ఉమశ్రీ సోమవారం రాత్రి హైదరాబాద్‌ వస్తున్నట్లు చెప్పడంతో పిన్నమనేని దంపతులు కూడా సోమవారం రాత్రే గుడివాడ నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ సమీపంలో వారి వాహనం ప్రమాదానికి గురైంది.

సీటు బెల్టుతో నిలిచిన ప్రాణం

సోమవారం అర్ధరాత్రి సమయం దాటాక వారు ప్రయాణిస్తున్న కారు (ఏపీ16డీసీ0555) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం కారు మూడు పల్టీలు కొట్టింది. కారు డోర్లు తెరుచుకోవడంతో డ్రైవర్‌ స్వామిదాస్‌, సాహిత్యవాణి కారు నుంచి బయటపడ్డారు. వారి తలలు బలంగా రోడ్డును తాకటంతో తీవ్ర గాయాలై అక్కడికకక్కడే మరణించారు. సీటు బెట్టు ధరించటంతో పిన్నమనేని రెండు సీట్ల మధ్య ఇరుక్కుపోయారు. ప్రమాదం జరిగాక కారు 50-60 అడుగులు ఈడ్చుకుంటూ వెళ్లినా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వెంకటేశ్వరరావును ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారును 140 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, వెంకటేశ్వరరావు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన మోకాలికి గాయమైందని, శరీరంలోనూ పలు చోట్ల చిన్నపాటి గాయాలున్నాయని చెప్పారు. పిన్నమనేని వేగంగా కోలుకుంటున్నారని, బుధవారం ఉదయం డిశ్చార్జ్‌ చేస్తామని ప్రకటించారు. మరోవైపు, పోస్టుమార్టం పూర్తికావడంతో సాహిత్యవాణి, స్వామిదాస్‌ మృతదేహాలను వారి కుటుంబీకులకు గాంధీ వైద్యులు అప్పగించారు. సాహిత్యవాణికి బుధవారం రుద్రపాకలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు.

ఎంతో అణుకువ

కృష్ణాజిల్లాలోని కుంటముక్కల గ్రామానికి చెందిన సాహిత్యవాణి, పిన్నమనేని వెంకటేశ్వరరావుకు 1986లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. రాజకీయ నేపఽథ్యమున్న పిన్నమనేని కోటేశ్వరరావు కోడలిగా రుద్రపాకలో అడుగిడిన సాహిత్యవాణి... ఆప్యాయత, అణకువకు మారుపేరు అని స్థానికులు అంటున్నారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు మంత్రి పదవిని చేపట్టే ముందు వరకూ... ఆమె రుద్రపాకలో అత్తవారింట ఉన్నారు. రాజకీయ ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి అతిథి మర్యాదలు చేయడం ద్వారా ఆ ఇంటికి పేరు తెచ్చారని అక్కడి వారు చెబుతున్నారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు రాజకీయాల్లో తలమునకలు కాగా, ఇంటి బాధ్యతలు, పిల్లల చదువు విషయాలను సాహిత్యవాణి చూసుకున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌ బయల్దేరే వరకూ రుద్రపాకలో గడిపి... కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె ఇలా దూరం కావడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు, హైదరాబాద్‌లో షేక్‌పేటలోని లేక్‌వ్యూ విల్లా టౌన్‌షి్‌పలోని పిన్నమనేని వెంకటేశ్వర్‌రావు ఇంటి వద్దా విషాద ఛాయలు నెలకొన్నాయి. వారు అక్కడికి వచ్చి ఆరు నెలలు అవుతోంది. భార్యాభర్తలిద్దరూ నిరాడంబరంగా ఉండేవాళ్లని, రోజూ వాకింగ్‌ చేస్తూ తమతో చాలా కలివిడిగా ఉండేవారని అక్కడి వారు అన్నారు. ప్రమాద వార్త తెలిసి వారి ఇంటికి పలువురు చేరుకున్నారు.

చంద్రబాబు సంతాపం

సాహిత్యవాణి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. పిన్నమనేని కుటుంబానికి సానుభూతి తెలిపారు. వెంకటేశ్వరరావుకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మరోవైపు, అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు... చికిత్స పొందుతున్న వెంకటేశ్వరరావును మంగళవారం పరామర్శించారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు భార్య మృతి పట్ల టెస్కాబ్‌ చైర్మన్‌ కె.రవీందర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top