'చండశాసనుడు' సినిమాకథా చర్చల సమయంలో ఓ రోజు రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఎన్.టి.ఆర్ ఇంటికి వెళ్లారట. ఆ సందర్భంలో సినిమాకు సంబంధించిన కథా చర్చలకు గాను మరుసటి రోజు ఉదయం 4 గంటలకు రమ్మని పరుచూరికి చెప్పారట ఎన్.టి.ఆర్. ఆయన వెళ్లిపోయారనే ధైర్యంతో గోపాలకృష్ణ తన పక్కనున్న వ్యక్తితో నేను పడుకునేదే రాత్రి 12 తర్వాత. ఆయనేమో 4 గంటలకు రమ్మంటున్నారు' అనగానే వెనుకనుంచి ఒక చెయ్యి ఆయన భుజం మీద పడింది. అది అన్నగారి చెయ్యి అనే విషయం అర్థమైన పరుచూరి గోపాలకృష్ణ మనసులో 'ఇక ఐపోయాంరా..' అనుకున్నారు. అయితే ఎన్.టి.ఆర్. సౌమ్యంగా 'అలాగయితే 6 గంటలకు కలుద్దాం బ్రదర్ ' అని లోపలకు వెళ్లిపోయారు. అప్పటికి ఊపిరి పీల్చుకున్న గోపాలకృష్ణ 'ఒక వేళ ఉదయం 6 గంటలకు లేవలేకపోతే పరిస్థితి ఏమిటి ' అనే సందేహం వచ్చింది. ఈ విషయంపై తర్జన భర్జనలు పడ్డ ఆయనకు చివరికి ఓ ఐడియా తట్టింది. అదేమిటంటే ఎన్.టి.ఆర్. పక్క ఇంట్లోనే నిద్రపోతే ఒకవేళ నిద్రలేవటం లేటయినా గబుక్కున గోడదూకి వెళ్లవచ్చు అనేది ఆ ఐడియా సారాంశం. ఈ ప్లాన్ ఫైనల్ చేసుకున్న గోపాలకృష్ణ ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఉన్న ఓ ఇంట్లో పడుకుని ఉదయమేలేచి ఎన్.టి.ఆర్. దగ్గరకు వెళ్లారట. అప్పటికే ఎన్.టి.ఆర్. రెడీ అయి కూర్చొనివున్నారు. గోపాలకృష్ణ వెళ్లిన వెంటనే ఆయన గడియారం చూశారట. అప్పటికే అది 6 గంటల ఒక నిమిషం చూపిస్తూ గోపాలకృష్ణకు జెల్ల కొట్టింది. ఎలాగోలా ధైర్యం తెచ్చుకున్న గోపాలకృష్ణ 'ఒక్క నిమిషమేనండీ' అనగానే, ఎన్.టి.ఆర్. 'చూడండి బ్రదర్, మా ఇంట్లోంచి ఒక లక్షరూపాయలు దొంగిలించుకుని వెళ్లినా క్షమిస్తాను. కానీ నా సమయంలో నుంచి ఒక నిమిషం వృథా చేసినా క్షమించను' అన్నారట గంభీరంగా.
సౌజన్యం : యుగానికొక్కడు
రచన : యు.వినాయకరావు
సౌజన్యం : యుగానికొక్కడు
రచన : యు.వినాయకరావు
Post a Comment
Thank U For ur Comments