సినీ గ్లామర్ ఎంతగా ఉపయోగపడుతుందో ఒక్కోసారి అంతే చెడు కూడా చేస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చే సినీ ప్రముఖుల విషయంలో ఇది చాలా కీలకం. సినిమా నటులుగా సంపాదించుకున్న అబిమానాన్ని రాజకీయాల్లో ఎదగడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఎంజీఆర్ - జయలలిత - కరుణానిధి - ఎన్టీఆర్ - చిరంజీవి వంటివారు దీనికి ఉదాహరణలు.. వీరిలో చిరంజీవి మినహా మిగతావారంతా ముఖ్యమంత్రులు కాగా... చిరంజీవి కూడా సొంత పార్టీ పెట్టుకుని రాజకీయ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత పెద్ద స్థాయి నాయకుడిగా మారిపోయారు. ఆయన టార్గెట్ అయిన ముఖ్యమంత్రి పీఠం ఆయనకు దక్కకపోయినా కూడా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసిన తరువాత ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేత - సీనియర్ నేత అనిపించుకున్నారు. ముఖ్య నేతగా అధిష్ఠానం వద్ద గుర్తింపు పొందారు. మిగతా రాష్ర్టాల్లోనూ సినీ గ్లామర్ తో రాజకీయాల్లో ఎదుగుతున్న నేతలున్నాయి. ఒడిశాలో అయితే.. అక్కడి ఒకప్పటి టాప్ హీరో సిద్ధాంత్ మహాపాత్రో బరంపురం ఎంపీగా వరుసగా గెలుస్తున్నారు. అనుభవ్ మహంతి వంటి కుర్ర హీరోలు కూడా రాజ్యసభ సభ్యులైపోయారు. భోజ్ పురి నటుడు మనోజ్ తివారీ కూడా ఎంపీ అయిపోయారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లో అక్కడి యంగ్ హీరో దేవ్ అధికారి ఏకంగా తృణమూల్ నుంచి ఎంపీగా గెలిచారు. కర్ణాటకలోనూ హీరోయిన్ దివ్య ప్రజాప్రతినిధిగా ఎన్నికవడానికి సినీ గ్లామరే కారణం. తాజాగా అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ పలువురు సినీ ప్రముఖులు పోటీ చేశారు. అస్సాంలో అంగూర్ లత ఢేకా అనే హీరోయిన్ బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అస్సాం అందాల నటి అయిన అంగూర్ ఆ దెబ్బతో సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారిపోయారు. హాట్ యాక్ట్రెస్ పొలిటీషియన్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి.
   
అయితే... సోషల్ మీడియాలో ఆమె ఫొటోల ప్రచారం శ్రుతి మించడంతో ఇప్పుడామె అది తనకు ఇబ్బందిగా మారుతోందని గుర్తించారు. హాట్ అనే ముద్ర వల్ల రాజకీయాల్లో ఇబ్బంది వస్తుందని గుర్తించి దానికి అడ్డుకట్ట వేయడానికి రంగంలోకి దిగారు.  తనకు అందం దేవుడిచ్చిన వరమని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా సమాజంలో మార్పు తెచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెబుతూ సోషల్ మీడియాలో తన ఫొటోల షేరింగ్ ఆపేయాలని కోరుతున్నారు.
   
ఈ విషయంలో ఆమె ఒకింత సీరియస్ గానే రియాక్టయ్యారు. టెక్నాలజీ పరంగా ఎదిగిన భారత్ - మానసికంగా మాత్రం ఎదగలేదని వ్యాఖ్యానించారు.  తనపై దుష్ప్రచారం తగదని దీన్ని ఆపాలని కోరుతున్నారు. మార్స్ పై అడుగుపెట్టిన ఈ కాలంలో కూడా మనుషుల మనస్తత్వాలు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  తనను ప్రోత్సహించింది ప్రధాని మోదీయేనని చెప్పిన ఆమె తనను హాట్ ఎమ్మెల్యే అనవద్దని కోరారు. భత్రదేవ్ నియోజకవర్గం నుంచి అంగూర్ లత పోటీ చేసి గెలవగా ఆమె సినిమాల్లో నటించినప్పటి ఫొటోలను పెడుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె అందాన్ని పొగుడుతున్నారు. దీంతో ఆమె రంగంలోకి దిగి ఇక చాలు ఆపేయండి బాబోయ్ అని మొరపెట్టుకుంటున్నారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top