ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌సిటీ: నగర శివార్లలో మహిళలపై కాలనాగులు విషం చిమ్మారు. ఎంతో మంది అతివలపై అఘాయిత్యాలతో అలజడి సృష్టిం చారు. తీవ్రభయాందోళన సృష్టించిన స్నేక్‌గ్యాంగ్ దురాగతాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై తమ ప్రతాపం చూపారు. చివరకు పాపం పండి ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా... పోలీసులు ఫిర్యాదును చెత్తబుట్ట పాల్జేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికెళ్లటంతో తొమ్మిదిమంది నిందితులపై కేసు నమోదైంది. వారిని పట్టుకునేందుకు పోలీసులు నానతంటాలు పడాల్సి వచ్చింది. ప్రత్యేక బృందాలు రంగంలోకిదిగి పట్టుకున్నాయి. న్యాయస్థానంలో రెండేళ్లపాటు కొనసాగిన విచారణలో సాక్షులను కాపాడేందుకు పోలీసులు, న్యాయవాదులు ఎంతో శ్రమించారు. పకడ్బందీగా సాక్ష్యాలు సంపాదించారు. 37 మంది బాధితులను విచారించిన రంగారెడ్డి జిల్లా న్యాయ స్థానం దోషులు క్షమార్హులు కాదని తేల్చింది. వారిలో ఏడుగురుకి యావజ్జీవ జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
దయానీ దందా
రెండేళ్ల క్రితం సాగించిన దయానీ దందా అప్పట్లో సంచలనం రేకెత్తించింది. పహాడిషరీఫ్.. గట్టులు, పుట్టలు.. చెట్లతో చుట్టూ నిర్మానుష్య ప్రాంతం. దీన్ని అడ్డాగా మార్చుకున్న ఓ ముఠా దారుణాలకు పాల్పడింది. ఆ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరిగే పాములను పట్టేవారు. వాటి కోరలు తీసి విషం దాచేవారు. కోరలు తీసిన పాములను చూపించి భయపెట్టారు. ఒంటరిగా ఉంటున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దురాగతాలకు పాల్పడిన ముఠా నాయకుడు ఫైసల్ దయానీ. జిమ్‌కోచ్ కావటంతో కుర్రాళ్లను చేరదీశాడు. ఖాదర్ బారక్‌తో కలసి పగటి వేళ పాములను పట్టేవాడు. వాటి కోరలు తీసి భద్రపరిచేవారు. పాములను తమ వద్దే ఉంచుకుని వాటితో ఆడుకునేవారు. విన్యాసాలతో భయాందోళ నకు గురిచేసేవారు. సకల హంగులతో ఇల్లు నిర్మించు కున్నాడు. గుర్రపు పందేలతో రోడ్డెంట వెళ్లేవారికి దడపుట్టించేవాడు. అంతటితో ఆగకుండా భూకబ్జాలు, ప్రైవేట్ పంచాయితీలు, బెదిరింపులతో భయానక వాతావరణం సృష్టించారు. స్నేక్‌గ్యాంగ్ పేరు వింటేనే జనం ఉలిక్కిపడేంతగా రెచ్చిపోయారు.
వీడియో దృశ్యాలతో బెదిరింపులు
ఆ ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్న మహిళలను ముఖ్యంగా ఫామ్‌హౌస్‌కు వచ్చే ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని ఆగడాలకు తెగబడేవారు. మహిళ లకు పాములను చూపి వివస్త్రలుగా మార్చేవారు. ఆ దృశ్యాలను బయటపెడతామని భయపెట్టి అవసరం తీర్చుకునేవారు. 2014 జూలై 31న ఫామ్‌హౌస్‌కు వచ్చిన ప్రేమజంటపై అత్యాచారం జరిపినట్టు బాధితురాలి పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేయకపోవటంతో బాధితు రాలు సీపీ సీవీ ఆనంద్‌ను ఆశ్రయించింది. ఫిర్యా దును తీవ్రంగా పరిగణించిన సీపీ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. పోలీసుల దర్యాప్తులో స్నేక్ గ్యాంగ్ ఆగడాలు ఒక్కొక్కటీ వెలుగుచూశాయి. ఫైసల్ దయానీ, ఖాదర్‌బారక్, తయ్యమ్ బాసలామా, మహ్మద్ పర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహ్మద్ ఇబ్రహీం, అలీ బారక్‌బా, సాలం హమీద్‌పై కేసు నమోదుచేశారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 37మంది మహిళలపై దారుణాలకు పాల్పడినట్టు తేలింది.
తీర్పు నేరస్థులకు గొడ్డలిపెట్టు
కరడుగట్టిన స్నేక్‌గ్యాంగ్ దురాగతాలపై న్యాయస్థానం తీర్పు నేరస్థులకు గొడ్డలిపెట్టు అని సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. రెండేళ్ల క్రితం స్నేక్‌గ్యాంగ్ సాగించిన ఆగడాలపై రంగా రెడ్డి జిల్లా కోర్టు శిక్ష ఖరారు చేయడంపై సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. స్నేక్‌గ్యాంగ్‌పై ఇచ్చిన తీర్పు సమాజానికి నమ్మకాన్ని పెంచుతుంద న్నారు. ఏడుగురు నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చరిత్రలో నిలిచి పోతుందన్నారు. కబ్జాకోరులు, అసాంఘికశక్తులు, రౌడీషీటర్లకు ఇది హెచ్చరికగా పేర్కొన్నారు. మే 14, 2014లో అభయ కేసులో ఇద్దరు నిందితులకు 20ఏళ్ల జైలుశిక్ష విధించారన్నారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని అప్పీల్‌కు వెళ్లను న్నట్టు తెలిపారు. సామూహిక అత్యాచార ఘటన నిరూపణలో బాధితురాలు మౌనంగా ఉండటం వల్ల నిరూపించలేకపోయినట్టు వివరించారు.
బెయిల్ నిరాకరణ
2014లో అరెస్టయిన వీరికి బెయిల్ లభించలేదు. వీరిలో ఐదుగురిపై పీడీయాక్ట్ ప్రయోగించారు బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, సాక్షులకు ప్రాణహాని ఉంటుందనే ఉద్దేశంతో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పలుమార్లు సాక్షుల నివాసాలపై దాడులు జరిగాయి. సైబరాబాద్ పోలీసుల సహకారంతో నిర్భయంగా న్యాయస్థానానికి హాజరైన వారంతా సాక్ష్యమిచ్చారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఎనిమిది మందిని దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. స్నేక్‌గ్యాంగ్ సభ్యులు ఫైసల్ దయాని, ఖాదర్ బారక్, తయ్యబ్‌బసలమా, మహ్మద్ పర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజాఅహ్మద్, మహ్మద్ ఇబ్రహీంలను దోషులుగా నిర్ధారిస్తూ వారికి జీవిత కారాగారశిక్ష, ఒక్కొక్కరికి రూ.5000 జరిమానా విధిస్తూ బుధవారం శిక్ష ఖరారు చేశారు. సామూహిక అత్యాచారం కింద వారిపై కేసు నమోదు చేసినప్పటికీ రుజువు కాకపోవడంతో బలవంతంగా యువతిని వివస్త్రను చేయడం ద్వారా మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన అంశంలో జడ్జి నిందితులను దోషులుగా నిర్ధారించారు. ఎనిమిదో నిందితుడైన అలీబాకర్బాకు 411సెక్షన్ కింద 20 నెలల జైలుశిక్షతో పాటు రూ.5000 జరిమానా విధించింది.

Post a Comment
Thank U For ur Comments