చికుబుకు చికుబుకు రైలే అదిరెను దీని స్టైలే....అనే పాటలో తన డాన్స్‌తో పిల్లల నుంచి యువతీయువకుల వరకు అందరినీ అలరించి సంచలనం సృష్టించిన నటి గౌతమి. సినీజీవితంలో కుటుంబ చిత్రాలకే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానంటారామె. నటిగా ఎన్నో అవార్డులతోపాటు, రెండో ఇన్నింగ్స్‌లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రెండున్నర దశాబ్దాలుగా నూట ముప్ఫైకి పైగా చిత్రాల్లో నటించిన గౌతమి ఇంటర్వ్యూ....
నేను శ్రీకాకుళంలో పుట్టాను. మా నాన్నగారు డాక్టర్ శేషగిరిరావు. అమ్మ డాక్టర్ వసుంధరాదేవి. హైస్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువగా నాటికల్లో నటించేదాన్ని. స్వంతంగా నాటికలు రాయడం, కథలు రాయడం... వంటి ప్రక్రియ లపై చిన్నప్పటి నుండే నాకు ఆసక్తి. అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్‌లో పాల్గొనేలా అమ్మానాన్న నన్ను బాగా ప్రోత్సహించేవారు. నేను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండే శాస్త్రీయ సంగీత కచేరీలకు హాజరై ఆసక్తిగా వినేదాన్ని. మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి గాత్ర కచేరీ ఎక్కడ జరిగినా ఆ కార్యక్రమాలకు మా కుటుంబ మంతా హాజరయ్యేవాళ్ళం. అలా శాస్త్రీయ సంగీతం పట్ల నాకు ఆసక్తి ఏర్పడింది. అన్ని లలిత కళల్లో పాల్గొనే దాన్ని. మరో ముఖ్య విశేషం ఏమిటంటే, పుస్తక పఠనం అంటే నాకు చాలా ఆసక్తి. మా ఇంట్లో అందరూ పుస్తక ప్రియులే. మా ఇంట్లో లైబ్రరీ కూడా ఉండేది. అందు వల్ల అన్నిరకాల పుస్తకాలు నాకు అందుబాటులో ఉండేవి.
దయామయుడు
విశాఖపట్నం గీతం ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సినిమాల్లో నటించాలని నేను ఏనాడూ కోరుకోలేదు. అనుకోలేదు. ఇంజనీరింగ్ కంప్లీట్ చెయ్యాలి, పై చదువులకు విదేశాలకు వెళ్ళాలనే పట్టుదల బాగా ఉండేది. కానీ అనుకోకుండా మా కజిన్ విజయ చందర్ గారు 'దయామయుడు' చిత్ర నిర్మాణం చేస్తూ అందులో నటించమని అడిగారు. మా అమ్మా నాన్నా కాదనలేకపోయారు. ఏదో చిన్న రోల్ కదా చదువుకు ఎలాంటి ఆటంకం ఉండదనే ఉద్దేశంతో అంగీకరించారు. ఆ సినిమా షూటింగ్ పూర్తికాగానే, మళ్ళీ చదువుకోవచ్చులే అనుకుని నేను కూడా అంగీకరించాను.
సినీ పాఠాలు
'దయామయుడు' చిత్రం ద్వారా ఏదో తెరమీద కనిపించాను తప్ప అది నాకు సంతృప్తిని ఇవ్వలేదు. కానీ పూర్తిస్థాయిలో సినిమాల్లోనే ఉండిపోవాలి అనుకుని ఆ చిత్రంలో నటించలేదు. కానీ విజయచందర్ గారు ఇచ్చిన ఈ అవకాశమే నా సినీ జీవితానికి ప్రేరణ అని చెప్పగలను. విజయచందర్‌గారితో పాటు నా సినీ కెరీర్‌లో ఎందరో ప్రముఖ దర్శకులు, నటుల దగ్గర చిత్ర పరిశ్రమలో ఏం చెయ్యాలి, ఏం చెయ్య కూడదు.. వంటి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ముఖ్యంగా నా అనుభవం నాకు సినీ పాఠం నేర్పింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల కూడా నేను ఈ రంగంలో నిలదొక్కుకోగలిగాను.
రజనీకాంత్‌తో హీరోయిన్‌గా
హీరోయిన్‌గా తమిళ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమయ్యాను. నేను నటించిన నా మొదటి చిత్రం 'గురుశిష్యన్'. ఇందులో రజనీకాంత్, ప్రభు గారు నటించారు. ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో నాతోపాటు సీత, మనోరమ తదితరులు నటించారు. ఈ చిత్రంలో నటించడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తాను. ప్రముఖ హీరో రజనీకాంత్ గారి చిత్రంలో ఆయన సరసన నటించడం నేను ఎన్నడూ ఊహించని విషయం. 1988లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్ కావడంతో నా కెరీర్ మలుపు తిరిగింది.
ప్రముఖ హీరోలతో
'గురుశిష్యన్' చిత్రం తర్వాత ఇక 1987 నుండి 1997 వరకు రజనీకాంత్, కమల్‌హాసన్, విజయకాంత్, ప్రభు గణేశన్, కార్తీక్, అర్జున్, అరవిందస్వామి, మురళి, రామ్‌కీ, రెహమన్, శరతకుమార్ లాంటి ప్రముఖ హీరోల సరసన హీరోయిన్‌గా అనేక చిత్రాల్లో నటించాను. ఇలా నటించడం నా పూర్వజన్మ సుకృతం. ఆ సమయంలో భానుప్రియ, ఖుష్బూ వంటి హీరోయిన్లతో పోటాపోటీగా నటించడం, అలా నేను నటించిన చిత్రాలన్నీ విజయవంతం కావడంతో నాలో నటించాలన్న కోరిక బలంగా నాటుకుంది. అపూర్వ సహోదరగళ్, రాజా చిన్న రోజా, దేవరమగన్, పనక్కా రన్, పూరువిట్టు ఊరువంతా.. ఇలా ఈ చిత్రాలన్నీ విజయవంతంగా ప్రదర్శితమయ్యాయి.
మలయాళ చిత్రం
సిబిమలయిల్ దర్శకత్వంలో మలయాళంలో నిర్మితమైన 'అబ్దుల్లా' చిత్రం నాకు మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రంలో మోహన్‌లాల్, నేను నటించాం. ఇది నాకు బాగా పేరు తెచ్చిన చిత్రం. మోహన్‌లాల్ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో నిడుముడివేణుకు ఉత్తమ సహాయ నటుడుగా, ఎం.జి. శ్రీకుమార్‌కు ఉత్తమ గాయకుడిగా జాతీయ ఫిలిం అవార్డులు రావడం, ఉత్తమ సంగీత దర్శకుడుగా రవీంద్రన్‌కు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు రావడం ఒక ముఖ్యవిశేషం. ఇది ఆ రోజుల్లో చర్చనీయాంశమైంది. 1990లో విడుదలైన ఈ చిత్రం బ్రహ్మాండమైన విజయం సాధించింది. అదేవిధంగా మరో మలయాళ చిత్రం 'ధ్రువం' నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. విక్రమ్ నటించిన మొదటిచిత్రం ఇది. 1993లో విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు జోషి. ఈ చిత్రంలో నాతోపాటు మమ్ముట్టి, జయరామ్, సురేష్‌గోపి, రుద్ర తదితరులు నటించారు.
తెలుగులో హీరోయిన్‌గా
తెలుగులో హీరోయిన్‌గా నేను నటించిన తొలి చిత్రం 'గాంధీనగర్ రెండవ వీధి'. రాజేంద్ర ప్రసాద్ హీరో. పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వంలో నిర్మిత మైన ఈ చిత్రంలో రంగనాథ్‌గారి కుమార్తెగా నటిం చాను. చంద్రమోహన్, వీరభద్రరావు, జయసుధ తదితరులు నటించారు. 1987లో విడుదలైన ఈ చిత్రం శత దినోత్సవం చేసుకోవడం, నా పాత్రకు మంచి పేరు రావడం, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకోవడం నా అదృష్టం. ఈ చిత్రం షూటింగ్ సమయంలో రంగనాథ్‌గారి దగ్గర నటిగా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఎంతో ఓర్పుగా నాకు ఎన్నో విషయాలు చెప్పేవారు. అసలు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయం నాకు దిగ్ర్భాంతి కలిగించింది. ఎందుకు అలా చేశారో అస్సలు అర్థం కావడం లేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. గాంధీనగర్ రెండవ వీధి చిత్రం తర్వాత నాకు తెలుగులో ఆఫర్లు వచ్చాయి. ముందుగా ఈ చిత్రాన్ని సత్యాన్ అంతికడ్ పేరిట మలయాళంలో తీశారు. తర్వాత తమిళంలో కూడా అన్నానగర ముదల్‌తెరు పేరిట నిర్మించారు.
శ్రీనివాస కల్యాణం
తెలుగులో నా రెండవ చిత్రం శ్రీనివాస కల్యాణం. 1987లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్. కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరో వెంకటేష్. భానుప్రియ, వై.విజయ, మోహన్ బాబు, గొల్లపూడిమారుతీరావు, ప్రసాద్‌బాబు తదితరులు నటించారు. ఈ చిత్రం తర్వాత ఎంతోమంది దర్శ కులు నా కాల్‌షీట్లు అడిగారు. కానీ అందరికీ ఎలా ఇవ్వగలను? దాంతో చాలా ఆఫర్లు మిస్ చేసుకున్నాను.
హిందీ చిత్రాలు
నేను హిందీలో నటించిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయి. ప్యార్ హువా చోరీ చోరీ, జనతాకీ అదాలత, హైవాన్, ఆద్మీ, అప్పురాజా, త్రిమూర్తి, తీస్రాకౌన్, నకాబ్ చిత్రాల్లో నటించాను. కొందరు హిందీ దర్శకులకు సైతం నేను కాల్ షీట్లు ఇవ్వలేకపోయాను. అది కొంత బాధ అనిపించింది. ఆచితూచి ఎంతవరకు చేయగలనో అంతవరకే కాల్‌షీట్లు ఇచ్చాను.
బాలు మహేంద్ర అభినందన
ప్రముఖ దర్శకుడు బాలు మహేంద్రగారికి పరిశ్రమలో ఒక ప్రత్యేక గౌరవం ఉంది. ఆయన దర్శకుడు మాత్రమే కాదు, లిటరరీ ఎడిటర్, సినిమాటో గ్రాఫర్, స్ర్కీన్ రైటర్, ఫిలిం ఎడిటర్.. ఇలా విభిన్న కోణాల్లో ప్రతిభ చాటుకుని ఎన్నో జాతీయ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారాయన. 'నువ్వు ఇంత బాగా నటిస్తావనుకోలేదు, నీకు మంచి భవిష్యత్తు ఉంది' అంటూ ఆయన నన్ను అభినందించారు. షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి ప్రత్యేకంగా వచ్చి కలిసి ఆయన నన్ను అభినందించారు. ఇది నా సినీ జీవితంలో మరిచిపోలేని సంఘటన. ఆయన అభినందనలే నా ఎదుగుదలకు ఊపిరి పోశాయి.
క్షత్రియ పుత్రుడు
దేవరమగన్ తమిళ చిత్రం నుండి క్షత్రియ పుత్రుడు చిత్రాన్ని డబ్ చేశారు. ఈ చిత్రంలో శివాజీగణేశన్, కమల్ హాసన్ నా నటనను ఎంతగానో కొనియాడారు. ఈ చిత్ర దర్శకుడు భరత్. తెలుగులో కంటే తమిళంలోనే ఈ చిత్రం బాగా సూపర్‌హిట్ అయ్యింది.
నేను నటించిన తమిళ టీవీ సీరియల్ 'అభి రామి' నాకు మంచి పేరు తెచ్చింది. ప్రస్తుతం తెలుగు మలయాళంలలో రూపొందుతున్న 'మనమంతా' చిత్రంలో నటిస్తున్నాను. జాతీయ ఫిలిం అవార్డు పొందిన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కొర్రపాటి సాయి ఈ చిత్రాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
క్రమశిక్షణకు మారుపేరు
ఆనాటి నటులు క్రమశిక్షణకు మారుపేరు. అప్పటి నటీనటులకు తగ్గట్టుగానే మంచి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు కూడా అద్భుతమైన చిత్రాలు వస్తున్నాయి. కానీ ఆనాటి తరానికీ, ఈనాటి తరానికీ పోలిక భావ్యం కాదు. ఆనాడు అందుబాటులో ఉన్న పరికరాలతో అద్భుత ప్రయోగాలు చేసి నాణ్యమైన చిత్రాలు అందించారు. ఈనాడు కూడా ఎన్నో ప్రయోజనాత్మకమైన కుటుంబ చిత్రాలు తీస్తున్నారు. బాహుబలి, రుద్రమదేవి, మగధీర, అరుంధతి, బొమ్మరిల్లు లాంటి చిత్రాలు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి తీసిన చిత్రాలే. ఆనాటి నటీనటులు కనిపిస్తే గౌరవంగా చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఇప్పటి నటీనటులు ఈ కాలానికి అనుగుణంగా ఉన్నారు. మార్పు సహజం. బిజీ బిజీగా ఉండటం సహజం. ఏ కళాకారుణ్ణీ అగౌరవపరచవల్సిన పనిలేదు. కళాకారులంతా బాగుండాలి. అప్పుడే సినీ పరిశ్రమ పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది.
అవార్డులు
'నమ్మఓరు పూవత్తై' చిత్రంలో నా నటనకు గాను 1990 తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక అవార్డు లభించింది. నీపతి నాన్‌పతి తమిళ చిత్రానికిగాను 1991 ఫిలిమ్ ఫేర్ అవార్డు, ఉత్తమ నటనకు సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు లభించింది. 1999 తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్‌గా చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కమల్‌హాసన్‌గారి 'దశావతారం' చిత్రానికిగాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవార్డు అందుకున్నాను.
Post a Comment
Thank U For ur Comments