భక్తులపై దాడి. 20 మందికి గాయాలు

చేర్యాల, మే 15 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌, మెదక్‌ జిల్లాల సరిహద్దులోని కొండపోచమ్మ ఆలయం వద్ద దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తమ ఇలవేల్పు దర్శనం కోసం హైదరాబాద్‌ నుంచి వచ్చిన భక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాళ్లు, కర్రలు చేతబట్టుకుని బీభత్సం సృష్టించడంతో 20 మంది గాయపడ్డారు. బాధితుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ జియాగూడకు చెందిన వృకుందాకార్‌ సుదేశ పెళ్లి ఇటీవల జరగడంతో కొండపోచమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు ఆదివారం కుటుంబసభ్యులు, బంధుగణంతో నాగపురికి చేరుకున్నారు. అమ్మవారికి బోనం నివేదించిన అనంతరం ఆరుబయట చెట్లనీడలో వంటకు ఉపక్రమించారు. అంతలో కారులో వచ్చిన నలుగురు యువకులు డీజే సౌండ్స్‌తో పాటలు పెట్టుకుని, మద్యం సేవించి డ్యాన్స చేస్తూ వంట చేస్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

ఇది గమనించిన కుటుంబసభ్యులు పక్కకు వెళ్లమని సూచించడంతో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ కాసేపటికే మరో కారులో మరో ఐదుగురితో కలసి తిరిగి వచ్చారు. అంతా చేతిలో కర్రలు, రాళ్లు, కొబ్బరికాయలు కోసే కత్తు లు చేత పట్టుకుని సుదీప్‌ కుటుంబసభ్యులపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఆడ, మగ, చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ కొట్టి పరారయ్యా రు. ఈ ఘటనలో కోయల్కర్‌ సంతోష్‌కుమార్‌, నవీనకుమార్‌, ఉదయ్‌ కుమార్‌, నరేశ, సుదేశ, నగేశ, రమేశ, మహేశ, చంద్రకళ, అనిత, శంకర్‌బాయి, సరితతో పాటు, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. అనిత జాకెట్‌ చించడంతో పాటు, 4తులాల బంగారు నెక్లెస్‌, చెవి కమ్మబుట్టాలు అపహరించుకుపోయారు.

చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఇబ్బంది పెట్టడంతో పాటు, వీరిపై దాడి చేయ డంతో ఆగ్రహించిన భక్తులు, ఆ యువకులు వచ్చిన కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ దాడిలో పలువురికి బలమైన గాయాలై రక్తస్రావం కావడంతో హుటాహుటిన చేర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇలా ఉండగా, ఇటీవల కొండపోచమ్మ ఆలయం వద్ద పోకిరీల ఆగడాలు మితిమీరుతున్నాయి.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top