నకిలీ, డా. సలీమ్ చిత్రాలతో తెలుగునాట కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'బిచ్చగాడు'. అప్పట్లో వెంకటేశ్ తో 'శీను' సినిమా చేసిన శశి ఈ సినిమాకి దర్శకుడు. 'పిచైక్కారన్' పేరుతో తమిళనాట విజయం సాధించిన ఈ సినిమా నేడు తెలుగు తెరమీదికి వచ్చింది. ఈ 'బిచ్చగాడు' తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో చూద్దాం.

కథ: అరుల్ (విజయ్ ఆంటోని) వందల కోట్లకు ఒక్కగానొక్క వారసుడు. చిన్నప్పుడే భర్తని పోగొట్టుకున్న అరుల్ తల్లి (దీప రామానుజం) అన్నీ తానె అయ్యి అరుల్ ని పెంచి పెద్ద చేస్తుంది. దాంతోపాటు కుటీర పరిశ్రమగా వున్న వ్యాపారాన్ని కోట్ల టర్నోవర్ కి మార్చి వృద్ధిలోకి తీసుకొస్తుంది. విదేశాల్లో చదువు పూర్తి చేసొచ్చిన తన కొడుక్కి వ్యాపార బాధ్యతలు అప్పగించే క్రమంలో ప్రమాదవశాత్తూ గాయపడి కోమాలోకి వెళిపోతుంది. ఎంతమంది వైధ్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోతుంది. ఆ క్రమంలోనే ఓ స్వామీజీ అరుల్ కి ఎదురుపడి 48 రోజుల పాటు ఓ వ్రతం చేస్తే మీ అమ్మ ఆరోగ్యం కుదుటపడుతుందని చెబుతాడు. ఆ వ్రతమేమిటి..? దాన్ని అరుల్ ఆచరించాడా లేదా.. చివరికి ఏమైంది తెలియాలంటే బిచ్చగాడికి ఖాతాలో టికెట్ కి సరిపడా సొమ్ము జమ చేయాల్సిందే.

నటీనటులు: నేటితరం యువకుడిగా, తల్లి కోసం ఆరాటపడే కొడుకుగా అన్ని భావోద్వేగాలు పండించి విజయ్ ఆంటోని తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్ గా నటించిన సత్న టైటస్ కి ఇదే తొలి సినిమా అంటే నమ్మడం కష్టమే. అంతలా తన నటనతో మాయ చేసింది. మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేసినా ప్రధాన కథ అంతా హీరో పాత్ర చుట్టురా తిరగడంతో థియేటర్ బయటకి వచ్చేసరికి ఆ పాత్రలేవీ గుర్తుండవు.

సాంకేతిక: ఇలాంటి ఓ ఎమోషనల్ కథకి సంగీతం ఎంతో ముఖ్యం. ఆ విషయంలోనూ విజయ్ ఆంటోనీకి మంచి మార్కులే పడతాయి. ఆయన అందించిన బాణీలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ గా నిలిచాయి. ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. భాషా శ్రీ రాసిన మాటలు నవ్వులు పూయిస్తూనే కంటతడి పెట్టిస్తే, పాటలు రచన పరంగా బాగున్నప్పటికీ పలకడంలో విరుపుల మూలంగా అంత రుచించవు. నిర్మాతగాను విజయ్ అంటోనీ ఖర్చుకు వెనకాడలేదు.

దర్శకత్వం - విశ్లేషణ : ఎమోషన్ కి లాజిక్ తో పనిలేదు. ఈ సినిమా చూసేముందు జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన విషయమిది. ఎందుకంటే ఒక నలభై ఎనిమిది రోజులు పరపతిని, సంపదని వదిలి ఖాళీ చేతులతో రోజు ప్రారభించి ఓ బిచ్చగాడిగా వుంటే తల్లి ఆరోగ్యం నయమవుతుందన్నది ఈ సినిమా అసలు కథ. ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించిన దర్శకుడు శశి బిలియనీర్ ని బిచ్చగాడిగా మార్చిన క్రమం ఆకట్టుకుంటుంది. దీనికి తోడు హీరో పెదనాన్న హీరో ఆస్తిని కాజేలాయని చూడటం, ఓ ఆశ్రమం ముసుగులో మందుల మాఫియా లాంటి ఉపకథలు ఈ సినిమాలో వున్నాయి. అవి కథలో ఇరికించినట్టు అనిపించకపోవడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. 

పైపెచ్చు హీరో పెదనాన్న పాత్ర సీరియస్ గా సాగినప్పటికీ ఆ పాత్ర ద్వారా పండిన కామెడి ప్రేక్షకులకు బోనస్. "నీ ప్రాణాన్ని కొన్నాళ్ళు నాకు బిచ్చంగా వేసే అమ్మ" అన్న మాటతో టైటిల్ జస్టిఫికేషన్ చేశారు. ఈ మాటతో తల్లి మామూలు స్పృహ లోకి రావడం సినిమా ముగింపు. ఈ ఎమోషన్ కి కనెక్ట్ అయితే బిచ్చగాడు అందరికీ నచ్చుతాడు.

ఈ బిలియనీర్ 'బిచ్చగాడి'కి టికెట్ రూపేణా ఓ వంద రూపాయలు దానం చేయొచ్చు

రేటింగ్ : 2.75/5

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top