- రాష్ట్రంలో 3 ప్రాంతీయ క్రీడా అకాడమీలు
- అరకులో గిరిజన క్రీడా పాఠశాల
- జిల్లాకో యువజన భవన్, యూత్ క్లబ్
- డ్వాక్రా తరహాలో యువతకు రుణ సౌకర్యం
- జూన్ 15 నాటికి డ్రాఫ్ట్ యూత్ పాలసీ సిద్ధం
హైదరాబాద్, మే 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2019 జాతీయ క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జాతీయ క్రీడల నిర్వహణకు ఏపీ ఒలింపిక్ సంఘం బిడ్ కూడా దాఖలు చేసింది. క్రీడల రాజధానిగా ఏపీని దేశంలో అగ్రగామిగా నిలపాలన్న సీఎం చంద్రబాబు పిలుపుమేరకు ఆ దిశగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. దీనిలో భాగంగానే నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నంలో 3 ప్రాంతీయ క్రీడా అకాడమీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019లో జాతీయ క్రీడలు రాషా్ట్రనికి వస్తే నెల్లూరులో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 150 ఎకరాల భూమిని క్రీడా ప్రాంగణానికి కేటాయించింది.
ఈ క్రీడా ప్రాంగణ నిర్మాణం కోసం రూ.6 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. నెల్లూరుతో పాటు తిరుపతిలోనూ క్రీడా ప్రాంగణం అభివృద్ధి చేయడం వల్ల కొన్ని క్రీడలు తిరుపతిలోనూ నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో ఈ రెండు ప్రాంతాలను ఎన్నుకున్నట్లు తెలిసింది. నిర్వహణ భారంతో ఇప్పటికే మూసివేసిన అకాడమీలను తిరిగి పునరుద్ధరించే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతి జిల్లాలో అన్ని క్రీడలకు సంబంధించి కోచ్ లను రిక్రూట్ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే ఉన్న వాళ్లను క్రమబద్ధీకరించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. డీసీడీవో బాధ్యతల నుంచి కోచలను తప్పించి క్రీడల మీద దృష్టిపెట్టేలా చేయాలని యోచిస్తోంది. అదేవిధంగా పాడేరు, అరకు ఐటీడీఏలకు కలిపి అరుకులో గిరిజన క్రీడా పాఠశాలను నిర్మించాలని రాష్ట్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రాబోయే జాతీయ క్రీడలకు స్టేడియంల నిర్మాణం, కోచల ఎంపిక, ఇతర సౌకర్యాల నిర్మాణానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలో సుమారు 33% ఉన్న యువతకు ప్రత్యేకంగా డ్రాఫ్ట్ యువజన విధానాన్ని రూపొందించడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విధానాన్ని జూన 15లోపు ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
యువతకు ప్రత్యేక బడ్జెట్!
2016-17 సంవత్సరానికిగాను రాష్ట్రంలోని యువతకు రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ నిధులతో జిల్లాకో యువజన భవనను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై స్పష్టమైన డ్రాఫ్ట్ కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. డ్రాఫ్ట్ యూత పాలసీని దేశంలో 7 రాషా్ట్రలు రూపొందించినా ఎక్కడా ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదు. దీంతో రాషా్ట్రనికి అనుకూలంగా, అమలు చేయటానికి వీలుగా ఉన్న విధానాలను యువతను అడిగి తెలుసుకుని వాటితో కొత్తపాలసీని సిద్ధం చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కొత్త విధానంలో డ్వాక్రా గ్రూపుల తరహాలో పొదుపు చేసుకుని రుణాలు ఇచ్చే సౌలభ్యాన్ని కల్పించనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న యువత ఉపాధికి ప్రత్యేక రాయితీ రుణాలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
యువశక్తి గ్రూపులకు స్వయం ఉపాధికి సంబంధించి జిల్లాకు 1000 నుంచి 1200 యూనిట్లను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఒక్కో యూనిట్‌కు దాదాపు రూ.లక్ష సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువజనులతో యువశక్తి సంఘాలను ఏర్పాటు చేసుకునేలా నిబంధన తీసుకురానున్నారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న యువజనులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల తరహాలో రాయితీ రుణాలు అందించాలని ప్రభుత్వ భావిస్తోంది. దీంతో పాటు వారు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి శిక్షణ ఇప్పించాలని దీనికోసం స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.
జిల్లాకో యువజన భవన నిర్మాణంతో పాటు యూత క్లబ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. యువతకు ముఖ్యంగా వ్యవసాయం, ఉద్యానవనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా తదితర రంగాలకు అనుబంధంగా శిక్షణ ఇవ్వటం వల్ల తక్కువ పెట్టుబడితో యువత ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశముందని ఆ రంగాల్లో యువతకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా ప్రతిభ కనబరిచిన యువతకు ప్రతి ఏటా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో యువత పాల్గొనేలా చూడటం తదితర విధానాలతో కొత్త యూత పాలసీని రూపొందించటానికి ఏపీ యువజన క్రీడా మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది.
Post a Comment
Thank U For ur Comments