ఆటో, టిప్పర్‌ ఢీ.. 15 మంది మృతి
•14మంది ఒకే కుటుంబానికి చెందినవారు
•బంధువుల రోదనతో దద్దరిల్లిన ఆసుపత్రి
•మృతుల కుటుంబాలకు మంత్రుల పరామర్శ
•ఒక్కొక్కరికి పార్టీ తరపున రూ. 25 వేలు
•ప్రభుత్వ ఖర్చులతో భైంసాలోనే సామూహిక దహనం

భైంసా/భైంసారూరల్‌ /ముథోల్‌/తానూర్‌, మే 15: ఎటు చూసినా రక్తమే.. అన్నీ ఛిద్రమైన శరీరాలే. చూపరుల హృదయాలను కలిచివేసే దృశ్యాలే! నాలుగేళ్ల చిన్నారి నుంచి మొదలు.. యాభై ఐదేళ్ల వ్యక్తి వరకు మొత్తంగా 14మంది.. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు.. వారి బంధువులు.. ఆ రాకాసి టిప్పర్‌ ఎవరినీ కనికరించలేదు! దైవదర్శనానికి ఆటోలో వెళుతున్న వారిపట్ల మృ త్యుశకటమై కబళించింది. మొత్తంగా పొట్టచేతపట్టుకొని పిల్లాపాపలతో రాష్ట్రంకాని రాషా్ట్రనికొచ్చిన ఆ కుటుంబం చివరకు ఈ మట్టిలోనే 'సామూహికంగా' కలిసిపో యింది.

నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలానికి బతుకుదెరువు కోసం వచ్చిన మహారాష్ట్ర వాసులు శనివారం రాత్రి దైవదర్శనానికి వెళుతూ మృత్యువాతపడ్డారు. శవాల గుట్టను చూసి స్థానికులు కన్నీంటి పర్యంతమయ్యారు. బంధువుల రోదనలతో అస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. మృతుల్లో 10మంది ఒకే కుటుంబ సభ్యులు.. మిగతావారిలో ముగ్గురు వారి సమీపబంధువులు ఉన్నారు. మృతదేహాలన్నీ ఛిద్రమై, సొంత రాషా్ట్రనికి తరలించలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం తరఫున భైంసాలోనే సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు.

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా బోకర్‌ తాలుకా బల్లాడ్‌ గ్రామానికి చెందిన బెజ్జవార్‌ గణపతి కుటుంబం నిజామాబాద్‌ జిల్లాలోని నవీపేట్‌ మండలం రాంపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామమైన లక్ష్మీకిసాన్‌ ఫారంకు రెండు సంవత్సరాల క్రితం వలస వచ్చింది.. వీరంతా ఇటుక బట్టీలలో కార్మికులుగా పనిచేస్తున్నారు. యేటా ఇటుక బట్టీల సీజన్‌ ముగియగానే.. ఆదిలాబాద్‌ జిల్లాలోని సారంగాపూర్‌ మండలంలోని అడెల్లి పోచమ్మ ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకొని తిరిగి మహారాష్ట్రకు వెళతారు. శనివారం పనులు ముగించుకొని నవీపేట్‌ నుంచి బాసర వచ్చారు. రాత్రి 10.30 ప్రాంతంలో బాసరలో ప్యాసింజర్‌ ఆటో (టీఎస్‌01యూఏ5328)ను అద్దెకు తీసుకొని దైవదర్శనానికి బయలుదేరారు.

ప్రమాదం ఎలా జరిగింది?

ఆటోలో మొత్తంగా 18 మంది బయలుదేరారు. దేగాం శివారులో గల బడ్‌గాం రహదారి దాటగానే ఆటోను కంకర లోడుతో ఉన్న టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్న ఇద్దరు భైంసా ఏరియా ఆస్పత్రిలో మృతి చెందారు. మిగితా నలుగురిని నిజామాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రేమ్‌ (4) అనే బాలుడు మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య ఆదివారానికి 15కు చేరుకుంది. మృతుల్లో ఏడుగురు చిన్నారులున్నారు.

సామూహిక అంత్యక్రియలు

ప్రమాదంలో మృతిచెందిన బాసర గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ సంపంగి బాబు మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా 14 మంది మృతదేహాలను మహారాష్ట్రకు తీసుకెళ్లలేని నిస్సహాయ స్థితిలో భైంసాలోనే అంత్యక్రియలు జరిపించారు. భైంసా కాలనీలోని పార్టీ బైపాస్‌ మార్గంలో వీరి అంత్యక్రియలు జరిగాయి. గణపతి పెద్ద కుమారుడు బె జ్జవార్‌ దీలిప్‌ తీవ్రగాయాలతో ప్రస్తుతం హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు రాహుల్‌, గంగాధర్‌లు నిజామాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మృతులు వీరే...


బజ్జేవార్‌ గణపతి (55), బెజ్జవార్‌ రత్నాబాయి (50), బెజ్జవార్‌ నర్సింగ్‌ (32), వందన (28), మహానంద (24), బెజ్జవార్‌ రాజేష్‌ (2), సాయిప్రసాద్‌ (6), బెజ్జవార్‌ ప్రేమ్‌ (4), మనుమరాళ్లు బెజ్జవార్‌ దీప (7), బెజ్జవార్‌ శ్యామల (19), గాయక్‌వాడ్‌ సుశీల బాయి (43), గాయక్‌వాడ్‌ అర్జున్‌ (8), బాలేరావు చోక్లి (9), పింకి (10), ఆటో డ్రైవర్‌ సంపంగి (23).

మంత్రుల పరామర్శ...

ఘోర రోడ్డు ప్రమాదంలో వలస కూలీలు కుటుంబం మృతిచెందడం పట్ల మంత్రులు హరీశ్‌,ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ జి.నగేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, మధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. కుటుంబీకులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్మికుల కుటుంబ సభ్యులు 14 మంది రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున పార్టీ నిధుల నుంచి సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. వారి అంత్యక్రియలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం తరపున అందిస్తామని చెప్పారు. వెంటనే ఆర్డీవో శివలింగయ్యను అంత్యక్రియల ఏర్పాట్లు చేయించాలని ఆదేశించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ రావు చౌహాన్‌, మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి గిరిష్‌ బాపట్‌తో ఈ సంఘటనపై ఫోన్‌ ద్వారా మాట్లాడారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.

ప్రమాదంపై సీఎం దిగ్ర్భాంతి

ఆదిలాబాద్‌ జిల్లా బైంసా సమీపంలోని దహేగాం వద్ద రోడ్డు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన సౌకర్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top