ఢిల్లీ, మే 15: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే! మరి ఢిల్లీలో ఉన్న కొడుకు ఎలా ఉన్నాడో చూడటానికి ఆ తల్లి వెళ్తే.. ఆ కుమారుడి ఆనందం అంతా ఇంతా కాదు కదూ!! ప్రధాని నరేంద్రమోదీకి గత ఐదురోజులుగా అలాంటి ఆనందమే కలిగింది. దేశ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన దాదాపు రెండేళ్లకు.. ఢిల్లీలోని రేస్‌కోర్స్‌రోడ్‌లో ఉన్న ఆయన అధికారిక నివాసానికి ఆయన తల్లి హీరాబెన్‌ విచ్చేశారు. ఐదు రోజులపాటు ఆయన వద్దనే ఉన్నారు. 

ఆమె గుజరాతకు తిరిగి వెళ్లిన తర్వాత.. మోదీ ఆదివారం ఆ వివరాలను ఫొటోలతో సహా ట్విటర్‌లో దేశప్రజలతో పంచుకున్నారు. ''మా అమ్మ గుజరాతకు తిరిగి వెళ్లింది. చాలాకాలం తర్వాత ఆమెతో ఎక్కువసేపు గడిపాను. అది కూడా.. రేస్‌కోర్స్‌ రోడ్‌ (నివాసానికి) ఆమె మొదటిసారి సందర్శనకు వచ్చినప్పుడు'' అంటూ మూడు ఫొటోలు పెట్టారు. అందులో రెండు ఫొటోలు హీరాబెన్‌ను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి.. ఆయన ఇంట్లోని తోటలో తిప్పుతున్నవి కాగా, మరొకటి హీరాబెన్‌కు ఆయన మంచినీళ్లు ఇస్తున్న ఫొటో. 

హీరాబెన్‌ గుజరాతలోని వాద్‌నగర్‌లో ఉన్న తన చిన్నకుమారుడు, మోదీ సోదరుడు పంకజ్‌మోదీ వద్దే ఉంటారు. ప్రధాని అయ్యాక కూడా మోదీనే అక్కడికి వెళ్లి తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు తప్ప.. ఆమె ఇన్నాళ్లుగా ఆయన నివాసానికి రాలేదు. అలాంటిది ఇప్పుడు రావడంతో ఆమెతో ఎక్కువసేపు గడిపారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top