ఖమ్మం, నేలకొండపల్లి: టీఆర్‌ఎస్‌ పతనం పాలేరు నుంచే మొదలవుతుందని, పాలేరు ప్రజలు టీఆర్‌ఎస్‌కు దిమ్మ తిరిగే తీర్పు ఇస్తారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం సాయంత్రం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారులు గ్రామాల్లో తిరుగుతూ అధికారపార్టీకి ఓటేయ్యాలని ప్రచారం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయని అన్నారు. అధికారులెవరైనా టీఆర్‌ఎస్‌కు ఓటెయ్యాలని ప్రచారం చేస్తున్నా, అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడినా వాయిస్‌ రికార్డు చేయాలని, అవకాశం ఉంటే ఫొటోలు తీసి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

పార్టీ మారాలంటూ బెదిరిస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టి, అరెస్టులు చేయిస్తామని హెచ్చరిస్తున్నట్లు కార్యకర్తలు చెపుతున్నారని, వారి ఆటలు సాగనీయమని భట్టి హెచ్చరించారు. పాలేరు ఉప ఎన్నిక పాలేరు ప్రజల పౌరుషానికి, కేటీఆర్‌, తుమ్మల అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీగా భట్టి వర్ణించారు. అభివృద్ది మంత్రం జపిస్తున్న తుమ్మల జిల్లాకు ఏం చేసాడో చెప్పాలని భట్టి సవాల్‌ చేసాడు. మానవత్వాన్ని పాలేరు ప్రజలు బతికిస్తారన్న నమ్మకం ఉందని, కాంగ్రెస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని భట్టి కోరారు. కార్యక్రమంలో ఉన్నం బ్రహ్మయ్య, కుక్కల హనుమంతరావు, మామిడి వెంకన్న, కొటారి ప్రసాద్‌, బొడ్డు బొందయ్య, బచ్చలకూరి నాగరాజు, పొట్టపింజర రవి, కుక్కల ఆదాం పాల్గొన్నారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top