7న సీఎం సమక్షంలో టీడీపీలోకి
•అదే బాటలో మరో ఎమ్మెల్యే?

కర్నూలు, మే 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ నుంచి అధికార టీడీపీలోకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. వలసలకు బాటవేసిన కర్నూలు జిల్లా నుంచే మరో ఎమ్మెల్యే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి ఈ నెల 7న పసుపు కండువా వేసుకునేందుకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే జిల్లాకు చెందిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో మూడు స్థానాలను గెలిచిన టీడీపీ.. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో తన బలాన్ని ఏడుకు పెంచుకుంది. దీంతో జిల్లాలో రెండు పార్టీల బలం సమానమైంది. ఇప్పుడు మోహనరెడ్డి చేరికతో టీడీపీ బలం పెరగనుంది.

పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీరుపై ఎస్వీ మోహనరెడ్డి రెండు మూడు రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో రాయలసీమ సమస్యలు, నదీజలాల అంశాలపై జగన్‌ కర్నూలులో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించకుండానే దీనిని ఖరారు చేశారనే విమర్శలు ఉన్నాయి. జగన్‌ ఒంటెద్దు పోకడపై మూడు రోజుల కిందటే జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో మోహనరెడ్డి కూడా జగన్‌ తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తితో టీడీపీ బాటపట్టినట్టు తెలుస్తోంది. ఈమేరకు ఆయన జిల్లా టీడీపీ నేతలతో చర్చించినట్టు సమాచారం.

ఈ నెల 7న సీఎం చంద్రబాబు జిల్లాకు వస్తున్న సందర్భంగా టీడీపీలో చేరేందుకు మోహనరెడ్డి ముహూర్తం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో వైసీపీ బలం తగ్గి టీడీపీ బలం పెరగడంపై నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోనే వైసీపీ నుంచి ఎమ్మెల్యేల వలసలకు మార్గం చూపింది కర్నూలు జిల్లానే. పీఏసీ చైర్మన స్థానంలో ఉన్న భూమా, తన కుమార్తె అఖిల ప్రియతో కలిసి తొలుత టీడీపీలో చేరారు. ఆతర్వాత జిల్లాకు చెందిన కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

మరో ఎమ్మెల్యే కూడా!
భూమా బాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఆ ఎమ్మెల్యే పార్టీ మారడానికి సిద్ధమై.. టీడీపీ నేతలతో కూడా మాట్లాడినట్టు సమాచారం.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top