హైదరాబాద్: తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రత్యూషను ప్రస్తుతానికి ఆ యువకుడితో కలవనీయవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల నుంచి మహిళా, శిశు సంక్షేమ విభాగం అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. అతడితో కనీసం మాట్లాడనీయవద్దని కూడా ఆదేశించినట్టు సమాచారం. ప్రత్యూష బాగోగులు స్వయంగా కేసీఆర్ పర్యవేక్షిస్తున్నందున.. ఈ విషయంలో ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలని అధికారులు నిర్ణయించారు. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన యువకుడిని ప్రేమించానని, అతనితో తన పెళ్లి జరిపించాలని ప్రత్యూష కోరిన సంగతి తెలిసిందే.
కాగా, ప్రత్యూష పెళ్లిని తానే స్వయంగా జరిపిస్తానని గతంలో కేసీఆర్ ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో కరీంనగర్ పర్యటన అనంతరం ప్రత్యూష ప్రేమ విషయమై కేసీఆర్ ఓ నిర్ణయానికి రావచ్చని అధికారులు చెబుతున్నారు. హైకోర్టు కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. అంతకుముందు జరిగిన పరిణామాలను గమనించినట్లయితే.. సవతి తల్లి, తండ్రి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష విషయం ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా బయటికి వచ్చింది. దీంతో హైకోర్టు సుమోటా తీసుకుని ఆమె సంరక్షణను ప్రభుత్వం తీసుకోవాలని సూచించింది. కాగా, సీఎం కెసిఆర్ ముందుకు వచ్చి ఆమెకు సంబంధించిన విద్య, ఆరోగ్యం, పెళ్లి అన్ని విషయాలను తానే స్వయంగా చూసుకుంటానని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.
Source: http://telugu.oneindia.com/
Post a Comment
Thank U For ur Comments