పాము రక్తం తాగాలి... గ్రెనేడ్‌తో ఆడాలి!
గ్రెనేడ్ పిన్ను పీకి చేతులు మార్చుకుంటూ ఆటాడాలి, తాచు పాము రక్తం తాగాలి, మొనదేలిన రాళ్లమీద చొక్కాలేకుండా పాకాలి, మంటల మధ్యలోంచి నడవాలి... కొంపదీసి ఇవన్నీ శిక్షలనుకుంటున్నారా... అస్సలు కాదు, కొన్ని దేశాల్లో మిలటరీ సైనికులకిచ్చే శిక్షణలు.
సైనికులంటే ధైర్యానికీ సాహసానికీ ప్రతీక. ప్రాణాలొడ్డి పోరాడి మరీ శత్రువుల బారినుంచి దేశాన్ని కాపాడతారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడతారు. అంతేకాదు, అంతటి ధైర్యసాహసాలు తమలో ఉన్నాయని నిరూపించుకోవడానికి ఎన్నో కష్టాలకోర్చి శిక్షణ కూడా తీసుకుంటారు. కొన్ని దేశాల్లో అయితే ఆ శిక్షణ మరీ కఠినంగా సామాన్యులకు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. అలాంటివే... ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఈ సైనిక శిక్షణలు.
గ్రెనేడ్‌తో ఆటా...
బుర్ర ఉన్నవాళ్లెవరైనా గ్రెనేడ్ పిన్ను పీకి చేత్తో పట్టుకుంటారా... అస్సలు పట్టుకోరు. కానీ చైనా దేశపు 'పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ' సైనికులు ఏకంగా దాంతో ఆటాడేస్తారు. పేలిపోవడానికి సిద్ధంగా ఉన్న గ్రెనేడ్లూ బాంబులున్నప్పుడు ఎలా బయటపడాలో నేర్పించేందుకు నిజంగానే సైనికుల చేతుల్లో పిన్ను తీసిన గ్రెనేడ్‌ను పెడుతున్నారు అక్కడి ఆర్మీ అధికారులు. అంతేకాదు, సెకెన్లలో పేలే దాన్ని ఐదారుగురు సైనికులున్న బృందంలో మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకూ చేతులు మార్చుకోవాలి. ఆఖరి వ్యక్తి దాన్ని కొంచెం దూరంలో ఉన్న గుంతలోకి విసిరెయ్యాలి. అదే సమయంలో అందరూ దూరంగా దూకెయ్యాలి. ఈ మొత్తం కార్యక్రమంలో ఏమాత్రం ఆలస్యమైనా, గ్రెనేడ్ ఎవరి చేతుల్లోనుంచైనా జారినా అందరి ప్రాణాలకూ ముప్పే. చూసేవారిక్కూడా చెమటలు పట్టించే ఇలాంటి శిక్షణలు 'పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ' శిక్షణలో చాలా సాధారణం. ఈ గ్రెనేడ్ శిక్షణా దృశ్యాలైతే యూట్యూబ్‌లోనూ ఎంతో ప్రాచుర్యం పొందాయి.
పాము రక్తం తాగాల్సిందే...
అమెరికా నావికాదళ సైనికులు శిక్షణలో భాగంగా కొన్ని రోజులు థాయ్‌లాండ్‌లోని అడవుల్లో ఉండాలి. నీరూ ఆహారం దొరకని సమయంలో సైనికులు తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలిపే కార్యక్రమం ఇది. దీన్లో భాగంగా వాళ్లు తాచుపాముల రక్తాన్ని తాగాల్సి ఉంటుంది. పాముల తోకల్నీ, తేళ్లనూ, కోళ్ల తలల్నీ తినాల్సుంటుంది. అంటే అత్యవసర సమయంలో ఏది దొరికితే దాన్ని ప్రాణాలకు ముప్పు లేకుండా తినడం నేర్చుకుంటారన్నమాట.
అమెరికా నేవీ సీల్‌లోనూ ఇలాంటిదే మరోరకం శిక్షణ ఉంది. దీన్లో భాగంగా గడ్డకట్టేంత చల్లటి సముద్రపు నీళ్లలో ఎనిమిది నిమిషాల పాటు తలను పెట్టి ఉంచాలి. తర్వాత కొద్ది సమయం ఇసుకలో పొర్లి శరీరం వేడెక్కగానే మళ్లీ రెండో రౌండ్ కోసం సన్నద్ధమవ్వాలి.
కడుపులో కాల్పులు
రష్యాకు చెందిన స్పెషల్ ఫోర్సులో అయితే మరో అడుగు ముందుకేసి తుపాకీతో సైనికుల కడుపులో కాలుస్తారు. ఆ సమయంలో వాళ్లు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ వేసుకుని ఉంటారు గానీ ఒక్కోసారి అది ఉన్నా తుపాకీ గుండు శరీరానికి తాకుతుంటుంది. శత్రువు తుపాకీతో ఎదురుగా నిలబడినా భయపడకుండా ఉండాలన్న విషయాన్ని ఇంత ప్రయోగాత్మకంగా నేర్పిస్తున్నారు.
రక్తమోడేలా...
తైవాన్ నావికాదళానికిచ్చే శిక్షణ చూస్తే ఇదొకరకమైన హింసేమో అనిపించకమానదు. 'రోడ్ టు హెవెన్' పేరుతో 50 మీటర్ల పొడవున మొనదేలిన అరచేయంత రాళ్లను పోసి చొక్కా లేకుండా వాటిమీద పాకమంటారు. మామూలు నేలమీదే అలా పాకడం కష్టం. అలాంటిది రాళ్లమీదంటే ఇంకెలా ఉంటుందో వూహించొచ్చు.
మంటల మీద నడక
ఐరోపాలోని బెలారస్ దేశంలో సైనికులను మంటల మీద కట్టిన ఇనుప చెయిన్ల మీద నడిపిస్తారు. ఏమాత్రం అటూ ఇటూ అయినా ఆ మంటల్లో పడటం ఖాయం.
కన్నీళ్లు పెట్టాల్సిందే
అల్లర్లు జరిగినపుడు ఆందోళనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాసుని వారిమీదకు వదులుతారు. ఆ వాయువు ధాటికి కళ్లు మండి ఎవరైనా దూరంగా పారిపోవాల్సిందే. కానీ బ్రిటిష్ ఆర్‌ఏఎఫ్ సైన్యానికి మాత్రం పారిపోయే వీలు కూడా ఉండదు. అవును, శిక్షణ సమయంలో వారిని టియర్ గ్యాస్‌తో నింపిన గదిలోకి పంపి తమ పేరూ బ్యాచ్ నంబర్లనూ గట్టిగా స్పష్టంగా చెప్పమంటారు. ఆ తర్వాతే బయటికి రానిస్తారు.
చొక్కా లేకుండా మంచులో...
దక్షిణ కొరియాలోని పియాంగ్‌చంగ్ ప్రాంతంలో చలికాలంలో ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీలకు పడిపోతుంది. అలాంటి వాతావరణంలో మందపాటి ఉన్ని దుస్తులు వేసుకున్నా ఉండలేం. కానీ స్థానిక స్పెషల్ ఫోర్స్ సైనికులు అంత మంచులో అసలు చొక్కానే లేకుండా పరిగెత్తాలి, కుస్తీలు పట్టాలి, ఆ మంచుతో ఆటలాడాలి. 'ఆట సంగతేమోగానీ అసలు ప్రాణాలతో ఉంటారా' అని సందేహం కలుగుతోందికదా...ఇన్ని కష్టాలకోర్చి శిక్షణపొందుతున్న ఆ సైనికులకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Post a Comment
Thank U For ur Comments