మోండ/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15: శస్త్రచికిత్స విఫలం కావడంతో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ పీఆర్వో రవీందర్‌(42) బ్రెయిన్‌ డెడ్‌ అయ్యారు. కరీంనగర్‌ జిల్లా జగిత్యాల మండలం రాయికల్‌ గ్రామానికి చెందిన రవీందర్‌ కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తీవ్రమైన తలనొప్పితో వారం రోజుల క్రితం ఆయన సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేరారు. 
పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ణయించారు. టర్కీ వైద్యనిపుణులు డాక్టర్‌ నాసికోసెర్‌ నేతృత్వంలో పదిమంది వైద్యులు బుధవారం రాత్రి ఆపరేషన్‌ చేశారు.

మెదడులో రక్తనాళాలను సరిచేసి స్టెంట్లను అమర్చారు. అనంతరం బ్లీడింగ్‌ కావడంతో.. గురువారం మరోసారి స్టెంట్‌ను సరిచేసే ప్రయత్నం చేశారు. చివరకు బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్‌, వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వైద్యులను కలిసి పరిస్థితిని సమీక్షించారు. 

ఏదైనా అద్భుతం జరిగి తిరిగి రవీందర్‌ ఆరోగ్యం కుదుటపడొచ్చని, కుటుంబ సభ్యుల కోరిక మేరకు వెంటిలేటర్‌పై కొనసాగిస్తూ అవసరమైన చికిత్స అందించాలని వైద్యులకు వారు సూచించారు. ఈటల పీఆర్వోగా రవీందర్‌ రెండేళ్లనుంచి పనిచేస్తున్నారు. 

ఆయనకు భార్య సరిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గతంలో జెమినీ టీవీ, ఈటీవీ, సాక్షి, టీవీ5లలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. 

మంత్రి హరీశ్‌రావు, జర్నలిస్టు నాయకులు దేవులపల్లి అమర్‌, రవిప్రకాష్‌, ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్‌ శ్రీనివాస్‌, రమణ తదితరులు ఆస్పత్రికి వచ్చి రవీందర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Source: Andhrajyothy

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top