అనంతపురం జిల్లాలో హిందూపురానికి రాజకీయంగా, వ్యాపార పరంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశ, రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చేసిన టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు హిందూపురం నుంచే తొలిసారి గెలుపొందారు. ఇటీవలి కాలంలో రాజకీయ, ప్రజా పాదయాత్రలను అందరూ హిందూపురం నుంచే ప్రారంభిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా ఉంటూ.. అనంతకు వాణిజ్య కేంద్రంగా ఉన్న 'హిందూపురం'కు ఆ పేరు ఎలా వచ్చిందంటే....
భారతదేశానికి టిప్పుసుల్తాన్ చక్రవర్తిగా ఉన్నపుడు హిందూరావు అనే సామంత రాజు ఇక్కడ సుంకాలు వసూలు చేసేవాడు. అప్పట్నుంచీ హిందూపురం జిల్లాలో ప్రధాన వర్తక కేంద్రంగా ఏర్పడింది. పురం చుట్టుపక్కల గ్రామాలతోపాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాలవారు కూడా ఇక్కడకు వచ్చి వ్యాపారాలు చేసేవారని చరిత్ర చెబుతోంది. ఇలా సుంకాలు పెద్ద మొత్తంలో వసూలయ్యేవి. హిందూరావు సకాలంలో సుంకాలు వసూలు చేసి, చక్రవర్తికి పంపేవారు. ఆ పన్నులతో పట్టణాన్ని అభివృద్ధి చేయాలని చక్రవర్తి భావించారు. ఈ పట్టణం మొత్తాన్ని హిందూరావు ఆధీనానికి అప్పగిస్తూ టిప్పుసుల్తాన్ ఉత్తర్వులిచ్చాడు. దీంతో హిందూరావు పూర్తిస్థాయిలో పురం ప్రాంతాన్ని పరిపాలించారు. అలా ఆయన పేరు మీద ఈ ప్రాంతానికి హిందూపురంగా పేరు వచ్చినట్లు చరిత్ర తెలుపుతోంది. నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
Post a Comment
Thank U For ur Comments