కొల్లాం: వూహకు అందని పెను విషాదం. అప్పటి వరకు ఉత్సవంలో పాల్గొని సంతోషంగా గడిపిన వారంతా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దైవ దర్శనానికి వెళ్లిన తమవారు విగతజీవులయ్యారని తెలుసుకుని బాధితుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. క్షణాల్లో జరిగిన ఈ దుర్ఘటన దాదాపు 102మందిని బలితీసుకుంది.
కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున 3గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 102 మంది మృతిచెందగా.. దాదాపు 350 మందికి పైగా గాయపడ్డారు. ఆలయ వేడుకల్లో భాగంగా కొందరు భక్తులు బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆలయం నలువైపులా వ్యాపించాయి. ఆలయంలో ఉన్న భక్తులు అగ్ని కీలలను చూసి భయంతో ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. అగ్ని ప్రమాదంలో కొందరు మృతిచెందగా, తొక్కిసలాటలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పివేశారు. క్షతగాత్రులలో ఎక్కవ మందిని త్రివేండ్రం వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో జనసమూహం ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే కేరళ ముఖ్యమంత్రి వూమెన్‌చాందీ, మంత్రులు ఘటనాస్థలికి బయలుదేరారు.
‘మీనాభరణి’ వేడుకల సందర్భంగా ప్రమాదం
పుట్టింగల్‌దేవి ఆలయంలో మలయాళ నెలల ప్రకారం భరణి నక్షత్రంలో మీనాభరణి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున బాణసంచా కాల్చడం ఆనవాయితీ. వీటితో పాటు అశ్వితి విలక్కు, కథాకళి, కంపడికాలి, మరమేడప్పు తదితర ఉత్సవాలను సైతం భారీగా నిర్వహిస్తారు. మీనాభరణి ఉత్సవం సందర్భంగా కొందరు భక్తులు బాణసంచా కాల్చడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Post a Comment
Thank U For ur Comments