నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, కాజల్‌, శరత్‌ కేల్కర్‌, ముఖేష్‌రుషి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, వూర్వశి, బ్రహ్మాజీ, పోసాని తదితరులు.
కథ, స్క్రీన్‌ప్లే: పవన్‌ కల్యాణ్‌, మాటలు: బుర్రా సాయిమాధవ్‌, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, నిర్మాతలు: శరత్‌ మరార్‌, సునీల్‌ లుల్లా, పవన్‌ కల్యాణ్‌, దర్శకత్వం: బాబి
సంస్థ: నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటీవ్‌ వర్క్స్‌, విడుదల: 8 ఏప్రిల్‌ 2016

పవన్‌ కల్యాణ్‌ చిత్రాల్లోకెల్లా.. గబ్బర్‌సింగ్‌ ఓ మైలురాయి. అందులోని డైలాగులు, పవన్‌ మేనరిజం ఇప్పటికీ ఆయన అభిమానులు గుర్తుపెట్టుకొంటూనే ఉంటారు. మరీ ముఖ్యంగా పవన్‌ పాత్ర చిత్రీకరణ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.. ఆసినిమాని నిలబెట్టింది. అందుకే... సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ అనే టైటిల్‌ పెట్టినప్పుడూ పవన్‌ అభిమానులు ఎంతో సంబరపడ్డారు. మరో ట్రెండ్‌ సెట్టింగ్‌ సినిమారాబోతోంది అని కలలు కన్నారు. దానికి తోడు.. సర్దార్‌పై రోజు రోజుకి విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే పవన్‌ కల్యాణే అందించడం, నిర్మాణ భాగస్వామిగానూ పవన్‌ పేరు కనిపించడంతో.. ఆయన అభిమానులు ఈ సినిమాపై మరింత మమకారం పెంచుకొన్నారు. ఈ అంచనాల మధ్య సర్దార్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి... సర్దార్‌ ఎలా ఉన్నాడు? గబ్బర్‌సింగ్‌తో పోలిస్తే... సర్దార్‌ పరిస్థితి ఏమిటి? ఈ వివరాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లిపోవాల్సిందే.
కథేంటంటే...
సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ (పవన్‌ కల్యాణ్‌) సీఐగా రతన్‌పూర్‌ అనే ప్రాంతానికి బదిలీపై వస్తాడు. సర్దార్‌ అడుగుపెట్టేటప్పటికే అక్కడి పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అదో రాజసంస్థానం. రాజకుటుంబం అప్పుల్లో కూరుకుపోతుంది. ఛారిటీల కోసం ఇవ్వాల్సిన సొమ్ము కోసం ఇంట్లో వస్తువుల్ని ఒకొక్కటిగా అమ్ముతుంటారు. రాజమహల్‌ని ఓ హోటల్‌కి అప్పగిస్తే... ఆర్థిక సమస్యలు తగ్గుతాయని రాజకుటుంబం అనుకొంటుంది. కానీ.. భైరవ్‌ సింగ్‌ (శరత్‌ కేల్కర్‌) మాత్రం ఆ ప్రయత్నాన్ని అడ్డుకొంటుంటాడు. రాచకుటుంబంతో అతనికి ఇరవై ఏళ్ల పగ. అంతేకాదు... రతన్‌పూర్‌ గ్రామంలో ఉన్న మైనింగ్‌ కోసం అక్కడి వ్యవసాయ భూమిల్ని రైతుల దగ్గర్నుంచి బలవంతంగా లాక్కుని రైతుల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఈ స్థితిలో రతన్‌పూర్‌లో అడుగుపెట్టిన సర్దార్‌ ఏం చేశాడు. అక్కడి సమస్యల్ని ఎలా తీర్చాడు అన్నదే సర్దార్‌ కథ.

ఎలా ఉందంటే...
'సినిమా అభిమానులకు నచ్చితే చాలు.. గట్టెక్కేయొచ్చు' అనే ధీమాతో ఉన్నారు అగ్ర కథానాయకులు. పవన్‌ కల్యాణ్‌ కూడా సర్దార్‌ విషయంలో అదే ఆలోచించాడేమో అనిపిస్తోంది. తన అభిమానులకు ఏం కావాలో.. ఆ దినుసులు అన్నీ పడేలా ఓ వంటకం తయారు చేశాడు. దాని పేరే సర్దార్‌. పవన్‌ ఒక్కడే ఈ సినిమా మొత్తాన్ని నడిపించేశాడు. తన అభిమానులకు ఏం కావాలో... అవన్నీ స్వయంగా వడ్డించాడు. పవన్‌ పోరాటాలు, అతని డైలాగులు, డాన్సులు, అల్లరి వేషాలు, కాజల్‌తో ప్రేమాయణం... వీటి మధ్య తొలి భాగం చకచకా సాగిపోతుంది.

తనకు మ్యాజిక్‌తో కథ ముందుకు కదలడం లేదన్న విషయాన్ని ప్రేక్షకులు మర్చిపోయేలా చేశాడు పవన్‌ కల్యాణ్‌. విశ్రాంతి ముందొచ్చే పోరాట ఘట్టం అభిమానులకు ఆకట్టుకొంటుంది. అక్కడ్నుంచి సర్దార్‌ సినిమా కథలోకి ప్రవేశిస్తుంది. అయితే పవన్‌ రాసుకొన్న కథలో గానీ, తీసిన సన్నివేశాల్లో గానీ కొత్త దనం కనిపించదు. వాటిలో ఉన్నది పవన్‌ కాబట్టి.. అభిమానులు ఎంజాయ్‌ చేస్తారు. ప్రతినాయకుడి పాత్రని శక్తిమంతంగానే చూపించినా, ఆ శక్తియుక్తులు ద్వితీయార్థంలో దాచేశారు. దాంతో... పవన్‌ తప్ప.. మరో విషయమేదీ కనిపించదు. గబ్బర్‌ సింగ్‌ తరహాలో అంత్యాక్షరి ఎపిసోడ్‌ ఉంది. క్లయిమాక్స్‌ ఫైట్‌ కూడా.. అంచనాలకు మించేలా ఉండదన్న భావన కలుగుతుంది.

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమా పవన్‌ కల్యాణ్‌ వన్‌ మ్యాన్‌ షో. ఆయన తన అభిమానుల కోసమే ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో పవన్‌ హుషారు ఆకట్టుకుంది. ఇంకొన్ని సన్నివేశాల్లో సాదాసీదాగా నటించడం ఆశ్చర్యపరుస్తుంది. చిరంజీవిని అనుకరిస్తూ డైలాగులు చెప్పడం, వీణ స్టెప్పు వేయడం అభిమానులకు నచ్చుతుంది. కాజల్‌ - పవన్‌లమధ్య నడిపిన సన్నివేశాలూ ఆకట్టుకొన్నాయి. కాజల్‌ యువరాణి పాత్రలో ఒదిగిపోయింది. బ్రహ్మానందం, అలీ అంతగా నవ్వించలేకపోయారు. ప్రతినాయకుడు శరత్‌.. నటన ఓకే.

దేవిశ్రీ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. పాటలన్నీ బాగున్నాయి. నేపథ్య సంగీతంలోనూ తన మార్క్‌ చూపించాడు. నిర్మాణ విలువల విషయంలో చిత్ర బృందం రాజీ పడలేదు. ఛాయాగ్రహకుడి పనితీరూ ఆకట్టుకొంటుంది. బుర్రా సాయిమాధవ్‌ తన సంభాషణలతో కిక్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిడివి కాస్త ఎక్కువగా అనిపిస్తోంది.

బలాలు
పవన్‌ కల్యాణ్‌, పాటలు, విశ్రాంతి ముందొచ్చే పోరాటం.

బలహీనతలు
బలమైన పాత్రలు లేకపోవడం.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top